Social Icons

Monday, September 26, 2016

వ్యథార్థ వనితల యథార్థ గాథలు

వ్యథార్థ వనితల యథార్థ గాథలు
Posted On: Saturday,July 9,2016
 'కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు..' సంపుటిలోవి కథలు కావు, జీవితాలు. ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఎదురయ్యే సజీవ దశ్యాలు. ఎదుటివారికి కనిపించని.. తాను మాత్రమే అనుభవించే వాస్తవ ఘటనలు. ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన
కథకురాలి అనుభవ చిత్రాలు.. సమాజ ప్రతిబింబాలు ఈ కథలు... మగాడి మోసానికి బలైన అబలలు.. జరిగిన మోసాన్ని నిబ్బరంగా ఎదుర్కొని తమ అస్తిత్వాన్ని నిలుపుకున్న సబలలు... మోసాన్ని భరించలేక.. ప్రేమను జయించలేక.. ఓటమిని అంగీకరించలేక ఆహుతైన సమిధలు ఈ కథల నిండా కనిపిస్తారు.
ఈ కథల నిండా వేదనాభరితమైన ద్ణుఖమే అయినా... చదువరులను కూడా ఆ పాత్రలు తమ చుట్టూ తిప్పుకుంటాయి. నిదురలో సైతం వెంటాడతాయి. ఎందుకంటే- అవి పాత్రలు కాదు... జీవితాలు. కవితలనే కాదు; కథలను కవితలుగా చెప్పగలిగిన విమల కథలు.
ఈ పుస్తకంలో 13 కథలున్నాయి. ఈ కథల గురించి ప్రముఖ రచయిత్రులు ఓల్గా, కాత్యాయని రాసిన కొన్ని మాటలు కూడా ఉత్తేజితంగా వుంటాయి. ఈ కథల ఇతివత్తాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ... మహిళలు ఎదుర్కొంటున్న వ్యధలు ఒక్కటే. నల్లపిల్ల నవ్వు, నీలా వాళ్లమ్మ మరికొందరు, దౌత్య, వాళ్లు ముగ్గురేనా?, చుక్కల కింద రాత్రి... కథలలో మగాళ్ల మోసానికి గురైన స్త్రీల వ్యధాభరిత జీవితాన్ని కళ్లముందుంచుతారు. 'నల్లపిల్ల నవ్వు'లో మధురిమ, 'నీలా వాళ్ళమ్మ' కథలో శ్యామల, 'వాళ్ళు ముగ్గురేనా?' కథలో యాదమ్మ ఏదో ఒకవిధంగా నిలదొక్కుకుని తమ జీవితాలను కొనసాగించడం కనిపిస్తుంది. 'వదిలేరు' కథలోనూ పెద్ద చదువులు చదువుకొని, పెద్ద ఉద్యోగం చేస్తున్న కరుణ సైతం తన భర్త నుంచి ఎగతాళి, వ్యంగ్యోక్తులు ఎదుర్కోక తప్పలేదు.
మార్తా ప్రేమకథ, కొన్ని నక్షత్రాలు.. కాసిని కన్నీళ్లు... కథలు విప్లవ నేపథ్యం నుంచి రాసిన ప్రేమకథలు. ఆ నేపథ్యం జీవితంలో ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కోగలిగే వారిగా తయారు చేస్తుంది. 'కనకలత' కథలో సంఘాలలో పనిచేస్తూ.. జీవితంలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశతో జీవన పోరాటం చేస్తుంది కనకలత. ఆ క్రమంలో అనేక సంబంధాల్లోకి వెళ్తుంది. ఆ సంబంధాలు ఆమె అస్తిత్వాన్ని హరించడంతో పాటు తనను మరింత దిగజార్చుతాయి. 'చుక్కల కింద రాత్రి' కథలో పదిహేడేళ్లయినా నిండకుండానే ఏడాదిన్నర బిడ్డకు తల్లై... మత్తు మందులకు బానిసై... వీధులనే ఇల్లుగా మార్చుకొని జీవించే సల్మా, ఆమె తల్లీ, అక్కల కథ. 
'దౌత్య' ఈ కథలన్నిటిలోకీ భిన్నమైన కథ. తాను విఫల ప్రేమతో ఆత్మహత్య చేసుకుంటుంది. దౌత్య మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లి ఆక్రందనతో ఈ కథ మొదలవుతుంది. దౌత్య తల్లిదండ్రులు మాధవి, శ్రీధర్‌. దౌత్య ఆత్మహత్యపై వచ్చిన రకరకాల కథనాలు, ఊహాగానాలు వారిని మరింత కుంగదీస్తాయి. దౌత్య ఆఖరి సందేశం పంపిన ఆ అర్ధరాత్రి... శ్రీధర్‌, మాధవి గాఢనిద్రలో వుంటారు. శ్రీధర్‌ మొబైల్‌కి 'మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు నన్ను క్షమించండి... నిత్యం చనిపోతూ బతకడం కంటే, శాశ్వతంగా చనిపోవడమే మేలనిపిస్తోంది' అంటూ మెసేజ్‌ వస్తుంది. ఆ మెసేజ్‌ పంపిన అరగంట తర్వాత దౌత్య ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ మెసేజ్‌ వెంటనే చూసి వుంటే, తనతో మాట్లాడివుంటే చనిపోయేది కాదేమో... అంటూ బాధపడతాడు శ్రీధర్‌.
ఉద్యోగం పేరుతో తొలిసారిగా బెంగళూరు వెళ్లిన దౌత్య... క్రమేణా మారుతూ వస్తుంది. ఆ మార్పును తల్లిదండ్రులు గుర్తించినా... కొత్త ఉద్యోగం, కొత్తచోటు అనుకుని సరిపెట్టుకుంటారు. ఆ తర్వాత పైచదువులకోసం రెండేళ్లపాటు అమెరికా వెళతానంటూ... తల్లిదండ్రులను ఒప్పించి వెళుతుంది. రెండున్నరేళ్ల తర్వాత అమెరికానుంచి తిరిగి వస్తోన్న దౌత్యను ఎయిర్‌ పోర్టులో చూసి నివ్వెరపోతారు. కళాకాంతులు లేని మొఖంతో, జబ్బుచేసిన మనిషిలా వచ్చిన కూతుర్ని చూసి తల్లడిల్లిపోతారు. తర్వాత నెమ్మదిగా తన ప్రేమ వ్యవహారం తల్లికి చెబుతుంది. 'నీ వెంట మేం ఎప్పుడూ వుంటామన్న విషయం మర్చిపోకు' అని తండ్రి భరోసా ఇస్తాడు. దాంతో కాస్త కుదుట పడుతోందనుకున్న దశలో తన స్నేహితురాలి వద్దకు హైదరాబాద్‌ వెళుతుంది. అలా వెళ్లిన 20 రోజులకే తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని చనిపోతుంది.
కుమార్తె జ్ఞాపకాలను ఏరుకుంటున్న క్రమంలో ఒక తోలుపెట్టె శ్రీధర్‌ ను ఆకర్షిస్తుంది. ఆ పెట్టెలో దౌత్య సర్టిఫికెట్లతో పాటు ఒక పెన్‌ డ్రైవ్‌ కనిపిస్తుంది. అందులో దౌత్య తనకు తానుగా చెప్పుకున్న తన ప్రేమగాథ కనిపిస్తుంది. తాను బెంగళూరు వెళ్లిన దగ్గర నుంచి... చనిపోయే ముందువరకు అనేక విషయాలను తానే స్వయంగా చెబుతుంది. అతన్ని ప్రేమిస్తున్న విషయం, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, సహజీవనం ఇత్యాది విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా చెబుతుంది. అతని కోసమే అమెరికా వెళ్లానని, అతని కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడిపోయానని, ఈ విషయం అమ్మనాన్నకు తెలియకుండా వుండేందుకు వారికి దూరంగా జరిగానని చెబుతుంది. తన ద్ణుఖం గానీ, ప్రేమ గాని అతడ్ని చలింపచేయలేకపోయిందని, చాలామంది పురుషులకి స్త్రీలు మిఠాయిల్లాంటి వాళ్లమోనంటూ.. సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. 'అతడు నా దేహాన్ని అర్థం చేసుకున్నట్లుగా... నా మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడా?' అని మధనపడుతుంది. 'అతను మరో అమెరికన్‌ అమ్మాయితో స్నేహం మొదలుపెట్టాడు. నన్ను తప్పుకు తిరుగుతున్నాడు. ఆ మనిషి పట్ల వెర్రిప్రేమ, కోపం, భయం, బాధ... మధ్య నా హదయం నలిగిపోయింది... చచ్చిపోవాలనిపిస్తోంది.' 'ప్రేమలో హింస, బాధ వుంటే అది ప్రేమెలా అవుతుందని' అమ్మ అంటుంది. కానీ తనకేం తెలుసు... నేను అతన్ని ఎంతగా ప్రేమించానో.. అయినా అతడిలాంటి మగాళ్లకి స్త్రీల హదయ భాష అర్థమౌతుందా? అంటూ... ద్ణుఖిస్తుంది. జీవితపు వైఫల్యాల నుంచి పారిపోయి తలదాచుకునేందుకు మత్యువును కోరుకునే అనేకమంది ఆడపిల్లల్లానే దౌత్య కూడా చనిపోయింది. దౌత్య అనుభవించిన వేదనని, మానసిక హింసని మాధవికి చెప్పాలా వద్దా అని మధనపడతాడు శ్రీధర్‌. చివరకు చెప్పకూడదని నిర్ణయించుకొని ఆ పెన్‌ డ్రైవ్‌ ను అటకమీదికి విసిరేస్తాడు. తమ హదయాలను ప్రేమతో వెలిగించి, అతడిలాంటి వాళ్లు పరిచే చీకటి దారుల్లోకి గుడ్డిగా నడిచివెళ్లే ఈ అమ్మాయిలకు ఎప్పటికి తెలియాలి, తమ ప్రాణాల్ని పుష్పాలుగా చేసి ఆ అల్పుల పాదాల ముందు రాలిపోకూడదని.. అంటూ రచయిత్రి తన ఆవేదన వెళ్లగక్కుతుంది. ఒక మగాడి ప్రేమ దొరకలేదనో, ప్రేమలో ఓడిపోయాననో చచ్చిపోయేంత బలహీనులా నేటి ఆడపిల్లలు!?
మొత్తంగా విమల కవిత్వంలో కోపం, వ్యంగ్యం, జ్వలనం కనిపిస్తే.... ఆమె కథల్లో వాటన్నింటి వెనుక ఉన్న బాధామయ జీవితాలు కనిపిస్తాయి. నిస్సహాయులైన స్త్రీల బతుకులు కనిపిస్తాయి. ఇవి ముగింపులేని కథలు.
- అంజనీ యలమంచిలి
98480 38585

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates