
కుటుంబ వ్యవస్థ ఇరుకుదనం పట్ల చిరాకు...
బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు...
అత్యాచారాల పట్ల ఆగ్రహం...
స్త్రీలు అనుభవిస్తున్న రకరకాల వివక్షలు, హింసల పట్ల దుఃఖం...
మనుషులు ఆరోగ్యంగా, శాంతిగా బ్రతకాలన్న ఆకాంక్ష...
మానవ వేదనను తొలగించాలన్న ఆర్తి...
అవినీతి సొమ్ము పట్ల ఏహ్యభావం...
మనుషుల ఉన్నతమైన జీవితానికి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటునందించే
విలువైన సమాచార సమాహారం ‘‘పున్నాగపూలు’.
పుష్ప బంధాలతో కట్టి పడేస్తూ మానసిక సంస్కారం నేర్పే నవల.
ఏరకుండా మర్చిపోయిన పువ్వుల్లా.. ఎన్నో జ్ఞాపకాలు...
‘‘విస్తృతమైన కాన్వాస్ మీద రకరకాల రంగులతో సమ్మోహనంగా
తన కుంచెతో దిద్దిన ఆ సర్వేశ్వర హస్తం. ఏ రంగు, ఏ పాళ్లలో కలిపాడా..’’ అంటూ...
ఈ నవలలో ఒకచోట (307పేజీ) రచయిత్రి చెబుతారు. నిజానికి ‘పున్నాగపూలు’ నవల కూడా
అంతే పెద్ద కాన్వాస్.
రకరకాల రంగులతో సమ్మోమనంగా తన కుంచెతో దిద్దినట్లే...
ఇందులోనూ భిన్న మనస్తత్వాలు, భిన్న అబిరుచులు, రకరకాల వ్యక్తిత్వాల కలబోతతో అంతే
సమ్మోహనంగా...
ఆ సర్వేశ్వరుడు కాన్వాసుపై రంగులద్దినంత మనోహరంగా
రచయిత్రి జలంధర గారు ఒక అద్భుత వర్ణ శోభితమైన చిత్రపటాన్ని రూపొందించినంత ఏకాగ్రతతో ఈ నవలను
తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది.
జీవితంలో చోటుచేసుకొనే అనేక అంతరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కావాల్సినన్ని పరిష్కారాలను
రచయిత్రి ఈ నవలలో తెలిపారు.ఎంతోమంది ప్రముఖ ఆంగ్ల, తెలుగు రచయితల, తాత్వికుల,
వేదాంతుల మాటలను ఉదాహరిస్తూ
మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే తపన పూలచెండులో దారం మాదిరిగా నవలలో మనకు కనబడుతుంది.
ఈ నవలలో కథానాయిక రాధ నుంచి, డ్రగ్ ఎడిక్ట్ స్వప్న, జీవితాన్ని చేజార్చుకున్న రాణి,
అన్నీ ఉండీ.. ఏమీ లేనిదానిగా అయిపోతున్న మంత్రి భిక్షపతి భార్య లక్ష్మీకాంతం,
జీవితాన్ని కక్షతో ఎంజాయ్ చేసే రాధ తల్లి లావణ్య, లావణ్యతో ఎప్పుడూ పోటీ పడే ప్రభావతి,
కమలిని, శ్రీదేవి, ఆరాధన, కళ్యాణి,
నర్సులు పరిమళ, గౌరి వంటి ఎందరో స్త్రీల మానసిక పరిణితి, వ్యక్తిత్వం, కుటిలత్వం వంటి అనేక
అంశాలను పరిచితం చేయటం ద్వారా చదువరుల మనసును సుతిమెత్తగా తట్టుతారు రచయిత్రి.
వ్యక్తిత్వమున్న అపురూప, వ్యసనపరుడు రాజారావు,
వికాసవంతుడు రఘు, జర్నలిస్టు విరించి, తనకన్నీ తెలుసనుకునే రామకృష్ణ.
వీళ్లందరి సమస్యలనూ ఓపికగా పరిష్కరిస్తూ... ఆసుప్రతిని ఓ దేవాలయంగా చేసుకొని, రోగులను
ఆప్యాయంగా చూడగలిగే డాక్టర్ కృష్ణ, షీలా మేడం, డాక్టర్ పిళ్లై వంటి ఉన్నతమైన పాత్రలు...
ఆద్యంతం పున్నాగపూల పరిమళం మన మనసును తాకుతూనే వుంటుంది.
ముఖ్యంగా స్త్రీలు అనుభవించే వివక్ష, అణచివేత, హింస వారినెంత దుఃఖపెడుతున్నాయో...
వారినెంత జఢపదార్థాలుగా, మానసిక రోగ గ్రస్తులుగా, నైరాశ్యం వైపు ఎలా మరల్చుతున్నాయో..
వారి జీవితాల్లో జరిగే విధ్యంసాల ప్రభావం వారిపైనే కాక వారి కుటుంబాలపైన,
మొత్తం సమాజంపైన ఎలా పడుతూందో వివిధ కోణాల్లో, పైన పేర్కొన్న రకరకాల పాత్రల ద్వారా
సమర్ధవంతంగా వెల్లడి చేస్తారు జలంధర. ఇదంతా పున్నాగపూలు జలజలా రాలుతున్నంత సహజంగా...
ఈ నవలలోని జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు మన మనోఫలకంపై రాలుతూ..
అనిర్వచనీయమైన అనుభూతికి లోనుచేస్తాయి.
మంచితనమనే ముసుగులో ముడుచుకునిపోయి బ్రతకడంకాదు..
ధైర్యంగా హక్కుల్ని సాధించుకుని అనుభవించమని...
బాధ్యతల భుజాలమీద హక్కులు నిలబడతాయని మరవొద్దని...
లోకాన్ని అర్థం చేసుకునేముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలని..ఇతరుల నుండి గౌరవం కోసం ఎదురు
చూసేముందు... నిన్ను నువ్వు గౌరవించుకోవాలని...
నీ సామర్ధ్యాల మీద ముందుగా నవ్వు నమ్మకం పెట్టుకోవాలని ఈ నవల ఉద్బోధిస్తుంది.
మనుషుల్లోని హిపోక్రసీని, దుర్మార్గాన్ని, కపటత్వాన్ని, దురాశను ఎండగడుతూ...
వీటిని ఒదిలించుకుంటేనే మనిషికి విముక్తి అని రచయిత్రి నిర్ద్వందంగా ఎండగడుతూనే...
అడుగడుగునా మానవతా విలువలను ఈ నవలంతా అక్షరాలుగా తొడిగారు రచయిత్రి.ఇక కథలోకి వస్తే..
ఈ నవలలో కథా నాయకి రాధ. తన భర్త రాజారావుకు లివర్ వ్యాధి చికిత్స కోసం
తన పెదనాన్న గారైన డాక్టర్ జీకె గారి చేర్పించడంతో కథ ప్రారంభమవుతుంది.
తాగుడుకు బానిసై, మూర్ఖంగా ప్రవర్తించే భర్తను నోరు మెదపకుండా భరించే రాధ జీవితం మీద
ఆమె తల్లి, తండ్రి, భర్త, అత్తింటివారి ప్రతికూల ప్రభావం విపరీతంగా వుంటుంది.
అందగత్తెననే అహంకారంతో డబ్బు, హోదా, అర్భాటం తప్ప
మనుషుల్ని మనుషులుగా గుర్తించని రాధ తల్లి లావణ్య.
తన అన్న డాక్టర్ జీకె, లావణ్య ప్రేమికులని తెలిసికూడా తనను పెళ్లి చేసుకున్న రాధ తండ్రి భార్య ముందు
నోరు లేనివాడిగా బ్రతుకుతూ కూతురిపై భార్య ధాష్టీకాన్ని ఆపలేకపోయాడు.
విదేశాల నుండి మానసికంగా ఉన్నతీకరింపబడి, జీవిత లక్ష్యాలగురించి నమూలంగా మారిన అభిప్రాయాలతో
స్వదేశానికి తిరిగి వచ్చి అవివాహితుడిగా మిగిలిపోయాడు డాక్టర్ జీకె.
తన తమ్ముడికి, ఒకప్పటి తన ప్రేమికురాలికి పుట్టిన రాధను ఎంతో ప్రేమగా 'బంగారుతల్లి' అంటూ
పిలుచుకుంటాడు. తన ఆరాధకుడిగా, తను స్థాపించిన హాస్పటల్‌లో డాక్టరుగా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ
రాధను ఇష్టపడుతున్నాడని తెలిసికూడా అటు రాధ తల్లి లావణ్యను, ఇటు కృష్ణ తల్లి ప్రభావతిని
ఒప్పించలేకపోతాడు జీకె.
డాక్టర్ జీకె పేరుమీద నడపబడుతున్న ఆ అందమైన, ప్రశాంతమైన జీకె హాస్పిటల్లో ప్రవేశించాక రాధ క్రమేపీ
ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇందుకు ఆమె మరిది రఘు, డాక్టర్ కృష్ణ ఆమెకు తోడ్పాటు
నందిస్తారు.
ఆ తర్వాత ఆ ఆసుపత్రిలో ఆమెకు పరిచయమైన వ్యక్తులు, జరిగిన సంఘటనలు..
ఆమె తన గురించి తాను విశ్లేషించుకోవడానికి, తనని తాను గుర్తించడానికి... తానేం కోల్పోయిందో
తెలుసుకోడానికి తోడ్పడినాయి.
చదువుకునే రోజుల్లో డాక్టర్ జీకెను ప్రేమించి, లావణ్యతో పోటీపడలేక తన ప్రేమను ఆరాధనగా మార్చుకుని,
అదే ఆసుప్రతిలో ముఖ్యపాత్రను నిర్వహించే డాక్టర్ షీలా,
అక్కడే చికిత్స పొందుతున్న రాణి, ఆమె కొడుకు సుందర్, స్వప్న, రామకృష్ణ,
ఇంకా ఎంతోమంది రాధ తనను తాను గుర్తించడానికి, తన భవిష్యత్తును నిర్దేశించుకోవటానికి,
తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి తోడ్పడ్డారు.
రాణి, సుందర్, స్వప్పల పట్ల రాధకు ఏర్పడిన ఒక బంధం... తద్వారా ఆమెలో వచ్చిన మార్పు
తనలో వికసిస్తోన్న చైతన్యానికి, వ్యక్తిత్వానికి చిహ్నాలుగా గుర్తిస్తారు డాక్టర్ కృష్ణ, డాక్టర్ షీలా, రఘు.
తన భర్త రాజారావు జీవితంలో తన స్థానం శూన్యమని, అతని జీవితంలో మరొక స్త్రీ, ఆమె కొడుకు
జీవితంలో నుండి తప్పుకుని... ఆమెకు చట్టపరమైన, గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించటానికి
రాజారావుకు విడాకులిస్తుంది రాధ. అయితే అప్పటివరకూ తనను అవమానకరంగా చూసే రాజారావు రాధను
వదులుకోలేని స్థితికి రావడం మరో మలుపు.
ఆత్మగౌరవంతో, చైతన్యవంతంగా బ్రతకడం గురించి అర్థం చేసుకుంటున్న రాధ తనింతవరకు
గుర్తించలేకపోయిన పెదనాన్న ఔన్నత్యాన్ని, ఆయనకు తన మీదున్న ప్రేమను, తన మీద ఆయన
పెట్టుకున్న ఆశలను గుర్తుచేసుకుంటూ తన భవిష్యత్తు కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటుంది. ఆయన ఆదర్శాల
పొదరిల్లు అయిన డాక్టర్ జి.కె. హాస్పటల్‌లో తను ప్రభావశీలమైన భాగస్వామి కావాలనుకుంటుంది.
అందుకోసం తన జ్ఞానాన్ని, నైపుణ్యాలను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో,
తనను అపురూపంగా తన జీవితంలోకి ఆహ్వానించడానికి డాక్టర్ కృష్ణ సిద్ధంగా ఉన్నాడని తెలిసికూడా
ఉన్నత విద్య, శిక్షణల కోసం విదేశాలకు వెళ్ళడంతో నవల ముగుస్తుంది.
ముఖ్యంగా ఆసుపత్రి వాతావరణం.. అక్కడ జరుగుతున్న వైద్యవిధానం... వైద్యసేవలు
ఆసక్తికరంగా వుండటంతో పాటు... ఇలాంటి ఆసుప్రతి నిజంగా వుంటే ఎంత బాగుణ్ణు అనిపిస్తుంది.
ఇక రాధ పాత్రను చిత్రించిన వైనం.. తొలినుంచీ ఆ పాత్ర పరిణితి చెందుతూ వచ్చిన క్రమం..
చదువరులను అమితంగా ఆకట్టుకుంటుంది. రాధ అంతరంగ సంఘర్షణ...
తన భర్త జీవితంలో తనకంటే ముందే మరోవ్యక్తి ఉన్నారని తెలిసిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయం...
దానికోసం ఆమె పడిన అంతర్మథనం.. పరిణితి చెందిన వ్యక్తిత్వం చక్కగా మలిచారు రచయిత్రి.
ఆ పాత్ర పట్ల మొదట కాస్త చిరాకు... తర్వాత కాస్త ఆసక్తి... ఆ తర్వాత సానుభూతి..
అలా మొదలై క్రమంగా ఓ అనుబంధం పెరుగుతుంది.
చివరకు తను పై చదువులకోసం ఇతర దేశాలకు వెళుతున్నప్పుడు...
ఒక భారమైన నిట్టూర్పు వెలువడుతుంది.
మొత్తంగా ఈ నవల దాదాపు 400 పేజీలు.
ఆసాంతం... రకరకాల వ్యక్తిత్వాల విశ్లేషణ, వైజ్ఞానిక చర్చ..
ఈ సందర్భంగా వచ్చిపోయే ఎన్నో పాత్రలు... వాటిని ఉపయోగించుకున్న తీరు..
దీనికి రచయిత్రి జలంధర గారు పడిన శ్రమ, కృషి మనకు కనిపిస్తుంది.
వ్యక్తిత్వ వికాసానికి, మానసిక విశ్లేషణకు అవసరమైన ఆలోచనలను రేకెత్తించడానికి,
మనసు పొరలను తట్టిలేపే పున్నాగపూల సుగంధ పరిమళం ఈ పుస్తకం.
సున్నితంగా ఉండే పున్నాగపూలతో జడ అల్లుతుంటే ఏ రకమైన అనుభూతి కలుగుతుందో...
చదువుతున్న పాఠకుల్లోనూ అంతే అనుభూతి కలుగుతుంది.
ఒకసారి చదివి పక్కన పడేసే నవల కాదు... ఇది వ్యక్తిగత లైబ్రరీలో ఉంచుకోదగిన పుస్తకం.
మన దేశంలోని ఏ కొద్దిమంది వైద్యులైనా ఈ నవల చదివితే...
తాము తమ వృత్తిని ఏ రకంగా నిర్వహిస్తున్నారో విశ్లేషించుకోడానికి ఖచ్చితంగా ఉపకరిస్తుందని
నమ్ముతున్నా.. ఈ నాలుగు మాటలు ఏ ఒక్కరికి ఉపయోగపడినా గొప్పతనం ఈ నవలా రచయిత్రి
జలంధర గారిదే.
No comments:
Post a Comment