
తెలుగు సాహిత్యంలో స్త్రీవాదాన్ని ప్రబల శక్తిగా నిలబెట్టిన సాహిత్యోద్యమకారిణి ఓల్గా.
అణచివేతకు గురవుతున్న స్త్రీలలో స్వేచ్ఛాకాంక్షను రగిలించిన నిప్పు కణిక ఓల్గా.
‘స్వేచ్చ’ నవలలో ‘అరుణ’ పాత్ర ద్వారా తన ప్రగతి వాదాన్ని స్పష్టీకరించారు ఓల్గా.
1987లో ఓల్గా గారు రాసిన ఈ నవలను ఈమధ్యనే మళ్లీ చదివాను.
దాదాపుగా ఈ పాతికేళ్ల కాలంలో సామాజికంగాను, విద్య, ఆర్థిక విషయాల్లో స్త్రీలు కొంత స్వేచ్ఛగా మనగల్గుతున్నమాట వాస్తవం. పురుషులతో సమానంగా అన్ని రంగాలలోనూ
రాణిస్తోంది. సమాజంలో స్త్రీ
మీద జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటున్నది. అయినా... ఇప్పటికీ స్త్రీలు స్వేఛ్చగా
తిరగలేని పరిస్థితి. యాసిడ్ దాడులు, గృహహింస, వరకట్న మరణాలు, ప్రేమించి మోసపోవడం వంటి
అనేక ఘటనలు మనం చూస్తున్నాం. అంటే.. స్త్రీలపై జరుగుతున్న అణచివేత రూపం మారింది
తప్పా... తీరు మారలేదు. చివరకు స్త్రీల వస్త్రాధారణపై కూడా నిషేధాలు, ఆంక్షలు చూస్తున్నాం.
మారిన కాలంతో పాటు.. బంధనాల స్వభావమూ మారింది. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందని
గురజాడ వారు చెప్పింది అక్షర సత్యం. అదే సమయంలో ఇదే ఆధునిక స్త్రీ కనబడని బంధనాల వలయం
చిక్కుకొనే వుంది. అంతర్లీనంగా ఆమెకుండే బంధనాలు ఆమెకూ ఉన్నాయి.
స్త్రీ స్వేచ్ఛ గురించి ఎవరెన్ని చెప్పినా.. ఈ కట్టుబాట్లు దాటాలని, తన సమస్యలపై తానే పోరాడాలని,
తాను నేర్చిన విజ్ఞానాన్ని నాలుగురికీ పంచాలనే ఆలోచనను పెంచుకోవాలి. తన స్వీయమానసిక ధోరణి
నుంచి బయటపడాలి.
‘మొత్తం సమాజాన్ని మార్చటం నాకు చేతకాదని - నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా
చెయ్యకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటున్నాను.
దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం
కదూ? నా బతుకు మాత్రమే నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక అర్థం
వుండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే యిప్పుడు నా పని.’
‘మనలాంటి వాళ్ళు స్వేచ్ఛకోసం ఏమీ చెయ్యకపోతే మన స్వేచ్ఛకు అర్థమేముంది?’
‘నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికి వల్ల సమాజానికేదో చలనం వుండాలి’ - అని
కథానాయికతో చెప్పించడం ద్వారా మహిళలకు స్వేచ్ఛ ఎంత అవసరమో రచయిత్రి స్పష్టం చేశారు. స్వేచ్ఛ
ఎవరో ఇచ్చేది కాదు.. స్త్రీ తన అవసరాలను, తన ఉనికినీ, తన వ్యక్తిత్వాన్నీ గుర్తించడమే స్వేచ్ఛ.
నిజానికి ఇది సాధించడమే చాలా కష్టం. ముఖ్యంగా పుట్టుక నుంచి అలవాటైన భావజాలం, కట్టుబాట్లు,
ఆచార వ్యవహారాల నుంచి తనకు తానుగా విముక్తం కావాలి.
ఇక నవలలోని ఇతివృత్తానికి వస్తే... ఈ కథలో నాయిక అరుణ. స్వేచ్ఛ కోసం చిన్ననాటి నుండి
భరించిన కట్టుబాట్లను తెంచుకొని, కోరుకున్న వాడితో వెళిపోతుంది. మరో ముఖ్యమైన పాత్ర అరుణ
స్నేహితురాలు ఉమ. ఎలాంటి తొందరపాటు లేకుండా లోతుగా ఆలోచించగలదు. ఢిల్లీలో పిహెచ్ డి
చేస్తూ.. తనకు నచ్చినవాడితో సహజీవనం చేస్తుంది. తనకు నచ్చిన పని చేయడానికి ఎవరికీ
భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా చెబుతుంది. అయితే... స్వేచ్ఛను కోరుకునే వీరిద్దరి
ఆలోచనల్లో, ఆచరణలో మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అలాగే అరుణ భర్త ప్రకాశం.. తాను
ప్రేమించానని చెబుతూనే నాకోసం నువ్వు, నీకోసం నేను.. మనం మన కుటుంబం.. ఈ పరిధిలోనే
వుండాలనుకుంటాడు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత స్వేచ్ఛ వున్నప్పటికీ... సమాజ పరంగా ఎన్నో
పరిమితులు విధిస్తుంటాడు... తద్వారా ఇద్దరి మధ్య గొడవలు. అంటే...స్త్రీకి స్వేచ్ఛ ఎంతవరకు
ఉండాలనేదానిపై ప్రకాశం దృష్టి వేరుగావుంది. చివరకు ప్రకాశం తల్లి కమలమ్మ కూడా ప్రకాశం కంటే ఇంకాస్త
విశాలంగా ఆలోచిస్తుంది. అరుణకు కమలమ్మే పెద్ద అండ. అయితే.. అరుణ పాత్ర చిత్రణ
మొత్తంగా... స్వేచ్ఛకోసం పరితపిస్తుంది. మొదటి నుంచి అరుణ అంతరంగ మథనాన్ని ఆసక్తికరంగా
మలిచారు రచయిత్రి. అయితే కొన్నిసార్లు అబద్దాలు చెప్పడం, కొన్నిసార్లు ఏం చేయాలో తెలియని
అయోమయ స్థితికి నెట్టబడడం, బేలగా మారడం వంటి అస్పష్టత.. ఆ పాత్ర సహజత్వాన్ని కొంత
తగ్గించినట్లుగా అనిపిస్తుంది.
చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, అన్నా, మేనత్త ఆంక్షల మధ్య పెరుగుతుంది అరుణ. తను ఏ పని
చేయాలన్నా.. చివరకు తను ఖర్చుపెట్టే ప్రతి పైసాకీ ఇంట్లోని అందరి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది.
తన తండ్రికి ఆర్థిక స్థోమత లేని కారణంగానే ఎమ్ఎ వరకు చదువుకోగలుగుతుంది. తనకు ఆర్థిక స్వాతంత్రం
కావాలంటే.. ఉద్యోగం సంపాదించాలి, తాను ప్రేమించిన ప్రకాశాన్ని పెళ్ళి చేసుకోవాలి. అప్పుడే తనకు
స్వేచ్ఛ లభిస్తుందని అరుణ ఆలోచన. ‘నేను ప్రకాశాన్ని పెళ్లి చేసుకుంటాను.. అప్పుడు నేను స్వేచ్ఛగా
ఉండొచ్చు..’ అంటుంది తన స్నేహితురాలితో. ‘అందరూ పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందని గోల
పెడుతుంటే, నువ్వు స్వేచ్ఛ కోసం పెళ్లి చేసుకుంటానంటే నవ్వు రాదూ..’ అంటుంది స్నేహితురాలు,
నవ్వాపుకుంటూ. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ప్రకాశాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది అరుణ. మూడేళ్ళ
సంసార జీవితం, ఓ పాపకు తల్లి కావడం.. ఈ క్రమంలో జరిగే పలు ఘటనలను రచయిత్రి ఆసక్తికరంగా
మలిచారు. మొదట్నుంచీ అరుణ ఉద్యోగం చేయటమూ, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం, సమాజ సేవ
వంటివి ప్రకాశానికి పెద్దగా నచ్చవు. ఈ క్రమంలోనే ‘పెళ్ళయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరి పాత్రలనూ
ప్రకాశమే పోషిస్తాడేమో..’ అని ఒకప్పుడు ఉమ అన్న మాటలు గుర్తొస్తాయి. నిజానికి అరుణ దృష్టిలో
ప్రకాశం చాలామంది మగవాళ్ళకన్నా మంచివాడే. కానీ.. స్వేచ్ఛ దగ్గర కొచ్చేసరికి వీరి ఆలోచనలు
భిన్నంగా వుంటాయి. అతనికి నచ్చేట్టుగా తాను ఉండలేదు.. అలా ఉండటమంటే... స్వేచ్ఛకి అర్ధం
లేదనేది అరుణ భావన. చివరకు సంసారం కావాలో, సమాజ సేవ కావాలో తేల్చుకోమంటాడు ప్రకాశం.
బంధనాల స్వభావం తెలిసే కొద్దీ అరుణకు స్వేచ్ఛ స్వరూపం కూడా అర్థమవుతుంటుంది. చివరకు బంధాల నుండి విముక్తం కావాలన్న నిర్ణయానికొస్తుంది.
No comments:
Post a Comment