దుబాయ్ పర్యటన అనగానే... నాకు విపరీతమైన కుతూహలం కలిగింది.
వెళ్లే తేదీ దగ్గర పడేకొద్దీ ఆ ఆతృత మరింత పెరిగింది.
ఎందుకంటే...
ఇప్పటివరకూ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను సందర్శించాను,
చాలావరకు అక్కడి ప్రాంతాలను చూసేశాను.
కానీ.. దుబాయ్ వెళ్లడం మాత్రం ఇదే ప్రప్రథమం.
అది ప్రపంచ పర్యాటకుల్ని అమితంగా ఆకట్టుకునే
విలాసవంతమైన నగరం.
విలాసవంతమైన జీవన శైలికి పెట్టింది పేరు ఆ దేశం.ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ ఉంది.
కేవలం షాపింగ్ కోసమే అక్కడికెళ్లాలని కోరుకునే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు.
అంతేకాదు పర్యాటకుల కోసం ఎన్నో అందమైన ప్రదేశాలు, ఆకర్షణలు అనేకం.
విందు, వినోదాలతో సాగే ఈవెంట్లకు దుబాయ్ పెట్టింది పేరు.
ఇన్ని ప్రత్యేకతలున్న ఆ దేశ అందాలను తనివితీరా ఆస్వాదించాలని ఎవరు మాత్రం అనుకోరు.
అందుకు నేనేమీ మినహాయింపు కాదు.
అందుకే అంత కుతూహలం.
దుబాయ్ లో ఎప్పుడు దిగాను...ఏ టైమ్ లో ఏం చేశాను అనేదానికంటేఅక్కడి అందాలను, వింతలను నేనెంత ఆస్వాదించానో మాత్రమే పంచుకోవాలనుకుంటున్నా..
అక్కడ...
అడుగు పెట్టిన దగ్గర్నుంచీ మనసు గాల్లో తేలిపోతున్నట్లనిపించింది.
రెప్పమూస్తే..ఎక్కడ ఏం మిస్సవుతానోననే ఆతృత.
మొత్తానికి నేను ఊహించినదానికంటే ఇంకా అద్భుతంగా వుంది.
ఎడారి ప్రాంతమైనా ఆధునిక నిర్మాణ రంగంలో దుబాయ్ ప్రగతి జగద్విఖ్యాతం.
ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన ఆతిథ్య కేంద్రాలు నన్ను అబ్బురపరిచాయి.
ఒక ఎడారి ప్రాంతాన్ని సుందర బృందావనంగా వాళ్లు మలిచిన తీరు నన్ను అమితంగా ఆకట్టుకుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే... ఇదో భూతల ఇంద్రలోకం.
మిరాకిల్ గార్డెన్ :
ఎడారి నట్టనడుమ వెలసిన సుందర బృందావం... పువ్వుల హరివిల్లు ఈ మిరాకిల్ గార్డెన్.
అద్భుత పూల పరిమళాలకు పుష్పాలంకారాలకు ఇది ఆలవాలం.
ఎంత చూసినా తనివితీరని ఈ పూదోట సోయగాలు గిన్నెస్ బుక్ రికార్డుల్లో లిఖితం.
ప్రపంచవ్యాప్తంగా 45 రకాల విలక్షణ పుష్పజాతులను ఇక్కడ పెంచుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ముఖ్యంగా ఈ పూలతోటలో యుఎఇకి చెందిన పూల పతాకం, పూల గడియారం,
పూలతో అలంకృతమైన ఓ ఫెర్రారీ కారు, పూల యాపిళ్లు, కృత్రిమ జంతువులు,
పూల పడవలు, ఒక ఇస్లామిక్ ఆర్చ్ డిజైన్ వంటివెన్నో పర్యాటకులను గొప్పగా ఆకర్షిస్తాయి.
ఎటువైపు, ఏ డిజైన్‌లో చూసినా రంగురంగుల పూలే మనకు దర్శనమిస్తాయి.
ఇది నిజంగా మిరాకిలే.. ఈ తోటలో విహరించడం నిజ్జంగా ఎవరికైనా మరిచిపోలేని అనుభూతే.
నాకైతే అది వదిలిరావాలనిపించలేదు నమ్ముతారు కదూ...
ఇక్కడే ఓ విల్లా కొనుక్కుంటే ఎంతబాగుణ్ణో అనిపించింది..
ఎందుకంటే రోజూ ఆ తోటలోని పరిమళాలను ఆస్వాదించొచ్చు గదా...
బుర్జ్ ఖలీఫా :
పర్యాటకుల మనసు దోచుకునే అత్యద్భుత మానవ నిర్మితం బుర్జ్ ఖలీఫా భవనం.
అత్యంత ఖరీదైన, విలాసవంతమైన బుర్జ్ ఖలీఫా దుబాయ్ నగర ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.
ఈ భవన నిర్మాణ శైలి నన్ను అబ్బురపరిచింది. కాసేపలా చూస్తుండిపోయాను.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవంతిగా ప్రసిద్ధి.
829.8 మీటర్ల ఎత్తైన ఈ భవనంలో 211 అంతస్తులున్నాయి.
గుండు పిన్ను మొదలు బంగారం, వజ్రాలు, రత్నాలతో పాటు
ఖరీదైన హోటల్స్, వైద్యసేవలు, వినోదం, ఆటలు వంటి సకల సౌకర్యాలున్నాయి.
పామ్ జుమెరా (palm jumeirah):
చూపరులను మంత్రముగ్ధులను చేసే పామ్ ట్రీ ఆకారంలో నిర్మితమైన ఆర్టిఫీషియల్ ఐలాండ్ ఇది.
మధ్యలో రోడ్డు, అటూ ఇటూ ఉన్న ఆకు ఆకారం పైన పెద్ద పెద్ద బిల్డింగ్స్.
కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ దీని సొంతం.
113 ఎకరాల విస్తీర్ణంలో గోడలనే ఆక్వేరియంగా తీర్చి దిద్దారు.
ఈ ఆక్వేరియంలలో సుమారు 65వేల చేపల రకాలు ఉన్నాయి.
ఈ పామ్ మీద నిర్మించిన మొదటి రిసార్టే అటాంటిస్.
దుబాయ్ మాల్ :
ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. దుబాయ్ సిగలో మరో మణిహారం ఇది.
ఈ మాల్ లో వంద హోటల్స్, ఒక థీమ్ ఫార్క్, అనేక మూవీ థియేటర్లు, హాస్పిటల్స్,
పర్యాటక సౌకర్యాలు, కొన్ని అపార్టమెంట్స్, 20,000 గదులు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయాను.
గామా అవార్డ్స్ :
కన్నుల పండువలా జరిగిన గామా అవార్డుల ఉత్సవంలో పాల్గొనడం మరో అనుభూతి.
సినిమా రంగంలో 24క్రాఫ్టులకు చెందిన అనేకమంది హేమాహేమీలు ఇందులో పాల్గొన్నారు.
వారందరితో కలవడం చాలా సరదాగా అనిపించింది.
ముఖ్యంగా గాయని సునీత గారితో కలిసి పర్యటించడం మరింత ఆనందాన్నిచ్చింది.
ఇక డిజర్ట్ సఫారీ (Desert safari) ఒక అడ్వంచర్ చేసిన అనుభూతినిచ్చింది.
చంద్రిక కంచర్ల, సునీత గారితో కలిసి ఇసుక తిన్నెలపై చిన్నపిల్లల్లా గెంతాము.
ఇది ఎప్పటికీ మరువలేని మధురమైన అనుభూతి.
ఇవేకాకుండా గోల్డ్ మార్కెట్, వెనీస్ ఆర్కిటెక్చర్, ప్రెసిడెంట్ ప్యాలెస్, అట్లాంటిస్, అబూదబీలోని షేక్ జాయెద్
మసీదు తదితర అద్భుతాలను మనసారా వీక్షించాము.
భూతల స్వర్గంలో అనుభూతుల విహంగమై
నింగినంటే ఆకాశ హర్మ్యాలను పరికించిన తారకనై
మిరాకిల్ పూల పరిమళాలను ఆస్వాదించె ఝంటెతేనియల తుమ్మెదనై
తిరుగు పయనమయ్యాం.. మదినిండా అనుభూతులను నింపుకొని.








No comments:
Post a Comment