Social Icons

Thursday, March 31, 2016

వినూత్న ప్రయోగం.. యండమూరి ‘అనైతికం’

ప్రముఖ సంచలన నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అద్భుతమైన శైలి, సస్పెన్స్ తో ఎన్నో
మంచిమంచి నవలలు రాశారు. వాటిలో నాకు బాగా నచ్చినవి... అనైతికం, ప్రేమ, అంతర్ముఖం. ఈ మూడు
రచనలు కూడా దేనికదే వైవిధ్యమైన శైలి, చక్కని బిగితో చదువరులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అన్ని వైపుల
నుంచీ చక్కని కూర్పుతో ముడివేసిన నేర్పు, చాకచక్యం ఈ నవలల్లో మనకు కనిపిస్తుంది. ఈమధ్య
పుస్తకాలు తిరగేస్తుంటే ‘అనైతికం’ పుస్తకం కనిపించింది. గతంలో చదివినా మళ్లీమళ్లీ చదవాలనిపించే పుస్తకం
కావడంతో మళ్లీ చదివాను. చదివితే మనసు ఊరుకుంటుందా.... అందుకే.. ఏదో నాలుగు మాటలు మీతో
పంచుకుందామని ధైర్యం చేస్తున్నా....

‘అనైతికం’ నవల తొలుత ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. సమాజంలో... కుటుంబంలో... వ్యక్తుల మధ్య
జరిగే సంఘటనల్లో కొన్నిటిని మనం గమనిస్తే ఏది నైతికత? ఏది అనైతికత అనే సందేశం కలగకమానదు.
దీనిని నిర్ణయించేదెవరు? ఒకరి నైతికతను మరొకరు ఎలా నిర్ణయిస్తారు? అసలు నైతికత అనేది
వ్యక్తిగతమా? సామాజికమా? గతం, వర్తమానం, భవిష్యత్తులకు ప్రతీకలైన ముగ్గురు యువతులు
సామాజికం, వ్యక్తిత్వం, నైతికం- ఈ నిబద్ధతలను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే కలిగే పరిణామాల
చిత్రణ అనైతికం. స్త్రీవాదాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తూ యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన విశ్లేషణాత్మక
నవల అనైతికం. ఇది ముగ్గురు స్త్రీలు వారి గురించి వారు చెప్పుకున్న వారి కథ. ఆ ముగ్గురి
మనస్తత్వాలు... పెరిగిన వాతావరణం... వారు ఎదుర్కొన్న సమస్యలు వేర్వేరుగా వుంటాయి. సామాజికం,
వ్యక్తిత్వం, నైతికం- అన్న మూడు కట్టుబాట్లకి ప్రతీకలు అహల్య, అచ్చమ్మ, శ్యామల. వీరి పాత్రలు తమ
కోణం నుంచి తమ కథలను తాము చెబుతూ వస్తాయి. నైతిక విలువల నిబద్ధతని అహల్య ప్రశ్నిస్తే...
వ్యక్తిత్వం గురించి పోరాడుతూ, శ్యామల సూర్యాన్ని నిరాకరిస్తే... సామాజిక నిబద్ధతను అచ్చమ్మ
నిలదీస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా పాత్రల జీవితాల్లో జరిగే మానసిక సంఘర్షణే ఈ కథకు మూలం. స్త్రీ
పురుష సంబంధాల్లోని సంక్లిష్టతను, నైతికత ముసుగులో దాగిన మనసు లోతుల్లోని భావాల
నగ్నత్వాన్ని, డొల్లతనాన్ని బట్టబయలు చేశాడు యండమూరి. పాత్రల వ్యక్తిత్వాలను తీర్చి దిద్దడంలో
యండమూరిది అందె వేసిన చెయ్యి. ఆ పాత్రల అంతరంగం... సహజత్వం... మనోభావాలను అత్యంత
ప్రతిభావంతంగా చిత్రీకరిస్తాడు. అహల్య అత్తగారింట్లో వాతావరణం... అత్తగారి జాణతనం.. భర్తగారి
మంకుతనం... బావగారి తెంపరితనం... చదువరులకు ఉద్విగ్నత, ఉత్సుకతను కలిగిస్తాయి. యండమూరి
నవలల్లోని స్త్రీ పాత్రలు అద్భుతమైన తెలివి, ఆత్మవిశ్వాసం... సహజసిద్ధమైన భావుకత... సున్నితతత్వంతో
ఆకట్టుకుంటాయి. ఈ నవలలోని మూడు ముఖ్యపాత్రలను ఆ తరహాలోనే సృష్టించాడు. ముఖ్యంగా అహల్య
పాత్ర... తన ఆలోచనలు వెంటవెంటనే మారిపోతూ వుంటాయి. తన ప్రవర్తనను తానే సమర్ధించుకుంటుంది.
చాలా తెలివైనదానిగా కనిపిస్తుంది... అంతలోనే అమాయకత్వం తొంగిచూస్తుంది. తనని తాను
సమర్థించుకొంటూ బలమైన గోడను కట్టుకుంటుంది. ఇక అచ్చమ్మ... చిన్నతనం నుంచి ఒక కసితో
పెరుగుతుంది. సమాజంపై పోరాడుతుంది. తన అస్తిత్వం, వ్యక్తిత్వం లను ఉన్నతంగా మలుచుకుంటుంది.
శ్యామల :
‘ద వుమెన్’ అన్న పుస్తకాన్ని ఇంగ్లండ్ లో నిషేధానికి గురైన సందర్భంగా ఈ కేసును విమన్స్ లిబ్ సంస్థ
తరుఫున ష్యామ్లా (శ్యామల) అనే న్యాయవాది వాదిస్తుంది. ఆమె స్త్రీ వాదానికి ప్రతీక. తన తల్లితో కలసి
లండన్లో ఉంటుంది. ఈ కేసు విషయంలో ప్రేమించిన వాడితోనే పోటీ పడుతుంది. ఈ సందర్భంగా స్త్రీ
పురుషుల సమానత్వం, హక్కులపై శ్యామల- సూర్యమ్ మధ్య కోర్టులో జరిగే చర్చ ఆసక్తికరంగా వుంటుంది.
ఎందరో జీవితాల్లోని అంతర్గత విషయాలు కోర్టులో బహిర్గతమౌతాయి. వివాహ వ్యవస్థ, స్త్రీ పురుషుల మధ్య
వుండే బంధాలు, అనుభూతి...వంటి ఎన్నో అంశాలు చర్చనీయాంశంగా మారతాయి. చివరకు శ్యామల
ఓడిపోక తప్పలేదు. ఓటమిని అంగీకరించలేని వేదనతో వున్న శ్యామలకు తన తల్లి తండ్రులు
విడిపోవడానికి కారణం తన పెదనాన్నతో తల్లికి గల సంబంధమే అని తెలుస్తుంది. ‘నేను స్త్రీ హక్కుల కోసం
వాదించిన లాయర్ని కావచ్చు... స్త్రీల తప్పుల్ని మాత్రం సమర్థించలేనంటుంది. తండ్రిని కలుసుకోడానికి
ఇండియాకు వచ్చిన ఆమెకు తండ్రి ఇంట్లో, మేనమామ ఇంట్లోని వాతావరణం.. రకరకాల అనుభవాలు స్త్రీ
స్వేచ్చకు అసలైన నిర్వచనాన్ని తెలుసుకొనేలా చేస్తాయి. స్త్రీల హక్కుల గురించి పోరాడాలని
నిర్ణయించుకుంటుంది.
అహల్య :
తరువాతి చాప్టర్ లో శ్యామల తల్లి అహల్య తన గతం చెప్పడం ప్రారంభిస్తుంది. అమ్మా, నాన్నా,
అన్నయ్యతో అపురూపంగా పెరిగింది అహల్య. పెళ్ళి తరువాత చాలా విషయాలతో ‘అడ్జెస్ట్’ కావలసి వస్తుంది.
ముఖ్యంగా భర్త అన్నీ అర్ధమైనా ఏమీ చేయని అసమర్ధుడు, అశక్తుడు. తన అమ్మతోడిదే లోకంగా
వుంటాడు. అహల్య తన భర్తను ఎంతగానో ప్రేమిస్తుంది. ఎన్నో ఆశలతో అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.
ఆమెకు ఎదురైన పరిస్థితి ఏమిటి? ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని
సంతరించుకున్న ఒక యువతి ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితులు అత్తవారింట్లో ఎదురవుతాయి. కొన్ని
కావాలని తెలివిగా సృష్టించబడతాయి. పెళ్ళిరోజు కూడా భర్తతో కాసేపయినా సరదాగా గడపాలనుకున్న ఆమె
చిన్న కోరిక కూడా భగ్నమైపోతుంది. ఈ విషయాన్ని అసలు పట్టనట్టే వున్న భర్తపై కోపం తారాస్థాయికి
చేరుతుంది. భర్తతో కలిసి జీవించలేని ఆమె అసహాయతను, మానసిక స్థితిని ఆమె బావగారు అవకాశంగా
మలుచుకుంటాడు. ఆమె తెలివితేటల్ని పొగుడుతాడు. తన జీవితంలోని ప్రేమరాహిత్యాన్ని, రసజ్ఞత లేమిని
అహల్య ముందు ప్రదర్శించి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. ఒకరి వల్ల చెలరేగిన మానసిక ఒత్తిడి,
అసంతృప్తి మరొకరితో సంబంధం పెట్టుకునేదానికి దారితీస్తుంది. అయితే అది కూడా అహల్యకు
ప్రశాంతతను ఇవ్వలేదు. ఆత్మవిమర్శ చేసుకుంటుంది. భర్తతో కలిసి కొత్త చోట, కొత్త జీవితం
ప్రారంభించాలనుకుంటుంది. అందుకు భర్త అంగీకరించడు. ఇదే సమయంలో తన తోడుకొడలు చెల్లెలు
చనిపోవడం, దానికి కారణం తన భర్తే అని తెలియడంతో ఒక నిర్ణయానికొస్తుంది. అనుకోని పరిస్థితుల్లో
బావగారితో కలిసి భర్తకు కనిపిస్తుంది. చివరకు విడాకులు తీసుకొని, తన కుమార్తెతో కలిసి లండన్
వెళిపోతుంది. ఏ దశలోనూ సుఖంగా వుండలేకపోతుంది.. సగటు భార్యాభర్తల మధ్య ఉండే అన్నిరకాల
భావోద్వేగాలను, అహల్య మానసిక స్థితిని రచయిత చాలా బాగా చిత్రీకరిస్తాడు. ఒక్కోసారి అహల్యపై
చదువరులకు విపరీతమైన సానుభూతీ కలుగుతుంది.
అచ్చమ్మ :
అచ్చమ్మ- ఈమె ఓ దళిత స్త్రీ. తనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ పోరాటం జరపాల్సి వస్తుంది.
ముందుగా తన పేరు కోసమే పోరాడాల్సి వచ్చింది. పేరు వినగానే అంతా వింతగా చూసేవారు. మార్చుకోమని
సలహా కూడా ఇచ్చారు. అయినా మార్చుకోలేదు. ‘నా అందాన్ని గమనించినప్పుడు సంభ్రమం.. నా పేరు
తెలియగానే ఆశ్చర్యం... నా కులం తెలియగానే ఒక చిన్న చూపులోకి పరిణమించడం.. వింతగా వుండేది.
జన్మతహా వచ్చిన కులం వల్ల గానీ, పెద్దలు పెట్టిన పేరు వల్ల గానీ అవమాన పడాల్సిందేమీ లేదంటూ...’ తన
వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది అచ్చమ్మ. ఉచితంగా భోజనం దొరుకుతుందని స్కూల్ లో చేరుస్తాడు తండ్రి. ఆ
తరువాత ముందు ముందు చదువు కోసం తండ్రి తోనే పొరాటం చేయాల్సి వస్తుంది. సురేష్ తన పట్ల
చూపించిన అభిమానంతో ప్రేమలో పడుతుంది. నవల చదువుతున్నపుడు మనకూ అతడు నచ్చుతాడు.
తర్వాత అతడో అవకాశవాది అనీ... పెద్ద వెదవ అనీ తెలుస్తుంది. అతడితో తాను సాగించిన సహజీవనం
వలన అతడి నిజస్వరూపం తెలుసుకొని ఆ జంజాటకం నుంచి బయటపడుతుంది. ఆ తర్వాత ఆమెను
అహల్య అన్న శ్రీకాంత్ పెళ్ళాడతాడు. సహజీవనం చేసిన సోకాల్డ్ భర్తతో విడిపోయేందుకు చాలా పోరాడాల్సి
వస్తుంది. స్వశక్తితో చదువుకొని పెద్ద ఉద్యోగస్తురాలై... నచ్చిన వాడిని వివాహం చేసుకుంటుంది. తన రాకను
ఇష్టపడని అత్త మామలను , ఆడపడుచును మంచితనంతో మార్చుకుంటుంది. ప్రేమించే భర్త, అభిమానించే
అత్తమామలు, చక్కని పిల్లలతో తన ఇల్లు దిద్దుకుంటుంది. తన పిల్లలను సైతం ఉన్నతమైన వ్యక్తిత్వం
గలవారిగా తీర్చిదిద్దుతుంది. చివర్లో శ్రీకాంత్ - అచ్చమ్మల కొడుకు హోమ్ సైన్స్ చదువుతూ ఉండటము,
కూతురు ఇంజనీరింగ్ చదివి కూడా గృహిణిగా స్థిరపడాలని ఉందని చెబుతుంది. ‘చదువుకీ, విజ్ఞానానికీ
కొలమానం ఉద్యోగం చేయడం కాదు... నా భర్త ఎలాంటి వాడో రెండేళ్లలో తెలుస్తుంది. కాబట్ట నన్ను చెరుకు
పిప్పిని చేసేవరకు నిలగిపోతూ వుండను, స్వంత కాళ్లపై నిలబడతానంటుంది. ఇది తన తల్లిదండ్రుల నుంచి
తను నేర్చుకున్న విలువలు.
ఎవరి నైతికత పట్ల వాళ్లకి నిబద్ధత ఉంటే చాలని, వారితో సంబంధం లేనివాళ్ళకు వాళ్ళను ప్రశించే హక్కు
లేదనీ యండమూరి నొక్కి వక్కాణిస్తాడు. అంతేకాదు... ఈ నవల ముందుమాటలో స్త్రీ వాదం గురించి
యండమూరి విశ్లేషణ కర్ర విరక్కూడదు... పాము చావకూడదు అన్న ధోరణిలో కనిపిస్తుంది. ఏదేమైనా
‘అనైతికం‘ ఓ వినూత్నమైన నవల. ఈ నవలను 2013లో ‘ఆకాశంలో సగం’ పేరుతో సినిమాగా కూడా
రూపొందించారు.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates