
‘గోదావరి కథలు’ సంకలనం విశేష ప్రాచుర్యం పొందింది. ముళ్ళపూడి వారి ఆత్మకథ
‘కోతి-కొమ్మచ్చి’లో సీతారాముడుగా రమణగారిచే పిలిపించుకున్న రామారావు గారు స్థానికంగా
సుదీర్ఘకాలం నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేసిన సమయంలో గోదావరి పరిసర ప్రాంతాలలో తనకు ఎదురైన అనుభవాలకు జీవం పోసి కథలుగా
మలిచారు. గోదావరి ప్రజల మనస్తత్వం, వారి భాషలోని
యాస ఈ కథలలో సహజాతి సహజంగా ధ్వనిస్తాయి. మొత్తం 14 కథల సంపుటం ఇది. ప్రతి
కథలోనూ గోదావరి సౌందర్యం పరవళ్లు తొక్కుతుంది. గోదావరితో జీవితాన్ని పెనవేసుకున్న అక్కడి జన
జీవన సౌందర్యాన్ని ఒడిసి పట్టుకున్న రామారావుగారు.. ఒక్కో కథను ఒక్కో ఆణిముత్యంగా
చిత్రీకరించారు. ఒక్కో కథలో ఒక్కో ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. అందుకే...
‘అందాలరాముడి సినిమాలో సావాలమ్మ పెసరట్లకు వుండే రుచి, పుష్కరాల రేవులో పుల్లట్లు కథకు వున్న
రుచి ఈ పుస్తకంలోని కథలన్నింటికీ పాకింది...’ అంటారు గోదావరి కథల సంపుటికి ముందుమాట
రాసిన పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు. వెన్న కాచినప్పుడు గోకుడు వస్తుంది. ఆ గోకుడిని గోదావరి
అంటారు. ఆ గోదావరికి వుండే రుచే... ఈ గోదావరి కథలకూ వుంది. ఇందులోని కొన్ని కథలలో
కష్టాలు.. కన్నీళ్ళూ... బంధాలు..అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తాయి. తరచి తరచి చూస్తే అవి
మనకెదురుపడే కొన్ని జీవితాలలోని కఠిన వాస్తవాలకు సజీవ రూపంగా మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి.
అలాంటి కథలలో పెద్ద కథ.. పుల్లట్లంత రుచికరమైన కథ... అల్లం పచ్చడిలా జుర్రుకోవాలనిపించేంతగా
నోరూరించే కథ ‘పుష్కరాల రేవులో పుల్లట్లు’ కథ. అయితే... ఈ కథలో పుల్లమ్మ పాత్ర చిత్రణ
అణగారిన వర్గ నేపథ్యమే అయినా మనసుకు హత్తుకొంటుంది. ఇది పుల్లమ్మ ప్రేమ కథ. ఆడది ఒకసారి
మనసారా ప్రేమిస్తే... తాను ప్రేమించినోడి కోసం, తన ప్రేమను సాకారం చేసుకోడం కోసం ఎంతటి
త్యాగానికైనా వెనుదీయదని చెప్పడానికి పుల్లమ్మే ఉదాహరణ. తాను ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. తన
వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తుదివరకూ పోరాటం చేస్తుంది.
“ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగిపోతుంటాయి. తరంగానికి
దిగువ మనకి కనపడని మరొక తరంగం ఉంటుంది, ఆ తరంగ శక్తే మనం చూస్తున్న తరంగాన్ని
నడిపిస్తుంది. అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని ఎన్నో బాధలూ కథలూ దాగి
ఉంటాయి. ఆ సాగే కథలకు పారే గోదారే సాక్షి”... అని ఈ కథ ప్రారంభంలోనే వ్యక్తుల అంతరంగాన్ని
చదువరుల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు రచయిత. రాజమండ్రి పుష్కరాల రేవులో పుల్లట్లు
పోసుకుని జీవించే నిష్కల్మష ప్రేమికురాలు పుల్లమ్మ ప్రేమగాథ ఈ కథ.
గోదావరిలో స్నానం చేసి ఉదయాన్నే నాలుగు పొయ్యిలు వెలిగించి నాలుగు రకాల అట్లు
పోస్తూ అష్టావధానం చేసే పుల్లమ్మ... తన అట్లకి తీసుకునేది నామ మాత్రపు ధరే. మైలాపూరులో
అయ్యరు హోటలు, బెజవాడలో బాబాయి హోటలుకు ఎంత పేరుందో రాజమండ్రిలో పుల్లమ్మ పుల్లట్లకూ
అంత పేరుంది. ఎవరికీ పార్సిళ్ళు కట్టకూడదన్నది ఆమె పెట్టుకున్న నియమం. ఎంత గొప్పోడైనా రేవు
మెట్లమీద క్యూలో కూర్చుని అట్ల కోసం పడిగాపులు కాయాల్సిందే. తను వేసిన అట్లు ఎదుటివాడు తినడం
చూస్తుంటే పుల్లమ్మకు ఎక్కడలేని సంతృప్తి. అది ఆమెకు ఒక వ్యసనంగా మారుతుంది. సంపాదనకంటే
కూడా నలుగురూ తన అట్లు తింటుంటే చూడాలన్న ధ్యాసే ఆమెకెక్కువ. అగ్నిహోత్రావధానులు సైతం
పుల్లట్ల కోసం ముసుగేసుకొని రేవు కొస్తాడు. కులం తక్కువది వేసిన అట్లు తినొచ్చా? అంటూ వాళ్ల
యూనియన్ ప్రశ్నిస్తే.... సిల్కు అట్టుకు అంటుకున్న అల్లప్పచ్చడి జుర్రుతూ... పుల్లట్ల రుచిని
ఆస్వాదిస్తూ... వాళ్లకు చురకలేయడమేగాక, ‘నువ్వూ తిందూగాని కూర్చో’ అంటూ వాళ్లననీ
కూర్చోబెడతారు. అదీ పుల్లమ్మ పుల్లట్లలోని మహిమ. పుల్లమ్మ పుల్లట్లు తినని జీవితం వ్యర్ధం
అనుకుంటారు గోదావరి రేవు చుట్టుపక్కల వాళ్ళు. అంతేకాదు వానాకాలంలో తిన్న పుల్లట్లు మరీ రుచిగా
వుంటాయట. అప్పుడు వచ్చే వాసనను పీల్చుకుంటూ గొడుగట్టుకుని నిలబడి అట్లు తింటుంటే మహాప్రభో
చెప్పలేం అంటారుట ఆ అట్ల రుచికి, ఆ వాసనకు అలవాటు పడినోళ్లు. ఇదంతా రచయిత తన
స్వీయానుభవంతో వర్ణిస్తోంటే... చదువుతున్న వాళ్లకు సైతం నోట్లో నీళ్లూరతాయంటే నమ్మండి.
పన్నుల శాఖాధికారి ఒకాయన ఆఫీసు పని మీద రాజమండ్రి వచ్చి, పుల్లమ్మ అట్ల
గురించి, వాటి రుచి గురించి విని లొట్ట లేసుకుంటాడు. ఎలాగైనా అట్లు పార్సిల్
తెప్పించుకోవాలనుకుంటాడు. 'కావాలంటే మీరున్న హోటల్ కొచ్చి అట్లు వేస్తాను కానీ పార్సిల్ కట్టను'
అని తెగేసి చెబుతుంది పుల్లమ్మ. ఆ ఆఫీసరుకు కోపం వస్తుంది. తన సంపాదన మీద పన్ను కట్టమనీ,
అలా కట్టకపోతే పుల్లమ్మ మీద కేసు రాయమనీ అంటాడు ఆఫీసర్. తానేమీ సంపాదించలేదని, కావాలంటే
తన ఇంటికొచ్చి చూడమంటుంది పుల్లమ్మ. వాళ్ళు వినిపించుకోకపోవడంతో 'నేను పన్ను కడితే ఆ డబ్బు
గవర్నమెంటు ఏం సేసుకుంటుంది బాబూ’ అంటూ అధికారిని ప్రశ్నిస్తుంది. 'ప్రభుత్వం వారు ఈ
డబ్బుతో ధర్మాసుపత్రులు కట్టిస్తారు, పోలీసు స్టేషన్లు కోర్టులు నడుపుతారు' అని చెబుతారు వాళ్ళు.
తన ప్రాణం పోయినా ధర్మాసుపత్రికి గాని, పోలీసు స్టేషన్ కి గాని వెళ్ళనని, కోర్టు గడప తొక్కనని
చెబుతుంది పుల్లమ్మ. కేసుకైనా సిద్ధపడుతుంది తప్ప పార్శిల్ కట్టడానికి మాత్రం ఒప్పుకోదు. నిజానికి
పుల్లమ్మ ఒకేఒకసారి పార్శిల్ కడుతుంది. అదే మొదటిసారి, చివరిసారి. ఆ ఊరికి ఎన్టీఆర్ వచ్చడాని
తెలిసి ఆయన కోసం మాత్రమే కడుతుంది. పుల్లమ్మ పన్ను కట్టడానికి సాయంత్రం 4గంటల వరకు టైమిస్తే,
పుల్లమ్మ అట్ల కొట్టు పక్కనే టీ కొట్టు పెట్టుకుని, ఆమెపై మోజు పెంచుకుని, ఎలాగైనా ఆమెను
దక్కించుకోవాలనుకునే ఈశ్వరయ్య కూడా అదే 4గంటల్లోపు ఏ సంగతీ తేల్చి చెప్పేయమంటాడు. అట్ల పని
ముగిశాక స్నానానికి గోదావరిలో దిగిన పుల్లమ్మకు గత జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి.
పుల్లట్లను అంత తక్కువ ధరకు ఎందుకిస్తుంది? పార్శిల్స్ ఎందుకు కట్టదు? దీనివెనుక మర్మం ఏమిటన్నది
ఫ్లాష్ బ్యాక్ లో వివరిస్తాడు రచయిత.రిక్షా తొక్కుకునే రాజయ్య, పాచిపనులు చేసుకునే రత్యాయమ్మ దంపతులకి గోదావరి రేవులో దొరుకుతుంది
చిన్నారి పుల్లమ్మ. తామే పెంచుకుని, తమ కొడుకు సారిగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. పేడ
పోగేసి పిడకలు అమ్మడం మొదలు, ఎన్నో పనులు చేస్తుంది చిన్నారి పుల్లమ్మ. వయసుతో పాటు
సారిగాడి మీద ప్రేమ కూడా పెరుగుతుంది. ఆడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. తను
చేసుకోబోయే సారిగాడు అట్లు పోసే మంగాయమ్మ వెనకాల పడుతున్నాడని తెలిసి...
విలవిల్లాడిపోతుంది. తనూ అట్లు పోయడం నేర్చుకుని సారిగాడిని తనవైపు తిప్పుకుంటుంది. హఠాత్తుగా
రత్యాయమ్మ చనిపోవడంతో ఇంటికి ఆడ దిక్కు లేదని పుల్లమ్మకు పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు రాజయ్య.
సారిగాడితో తన పెళ్లి జరుగుతోందని ఆనందంతో తబ్బిబ్బై.. ఊహల్లో తేలిపోతున్న పుల్లమ్మ, తన
మెడలో ఎవరు తాళి కడుతున్నారో కూడా తెలుసుకోలేనంత మైకంలో వుండిపోతుంది. తీరా తన మెళ్లో
తాళి కట్టింది సారిగాడి తండ్రి రాజయ్య కావడంతో నిర్ఘాంత పోతుంది. జరుగుతున్నదేమిటో అర్ధమయ్యేలోపే
తను చిన్ననాటి నుంచి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన వాడికి సవతి తల్లి అయిపోతుంది. తన మీద కన్నేసిన
బాబూరావు అనే కానిస్టేబుల్... రాజయ్యను పావుగా వాడుకొని.. పెళ్లి నాటకం ఆడించాడని
తెలుసుకుని... తనకి జరిగింది పెళ్ళే కాదనే నిర్ణయానికి వస్తుంది పుల్లమ్మ. అంతేకాదు సారిగాడ్ని
ప్రేమించడం మానుకోకపోగా, ఎలాగైనా ఆడ్ని దక్కించుకోవాలనే పంతం పెంచుకుంటుంది. సారిగాడి
మనసు మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. మంగాయమ్మ మైకం నుంచి సారిగాడ్ని తప్పించడానికి
ఆడి కోడిపందేల బలహీనతను వాడుకుంటుంది. ఈ ప్రయత్నంలో రాజయ్య పుల్లమ్మను అనుమానిస్తాడు.
ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవలో రాజయ్య చేతిలోని ఇనుప చువ్వ సారిగాడి తొడలో
దిగబడుతుంది. దీనికి భయపడిన రాజయ్య పారిపోతాడు. తీవ్రంగా గాయపడ్డ సారిగాడ్ని రిక్షాలో వేసుకొని
తనే ధర్మాసుపత్రికి తీసుకెళ్తుంది. గతంలో తన మీద మోజుపడిన డాక్టర్ వైద్యం చేయడానికి
నిరాకరిస్తాడు. ‘బాబూగోరూ... సారిగాడు సావుబతుకుల్లో ఉన్నాడు. మీరు బేగి రావాలి.
నామీద నమ్మకం లేపోతే యిప్పుడే మీ యిట్టం వచ్చినట్టు బేగి సేసెయ్యండి’... అంటూ ప్రేమించినోడి
ప్రాణం కాపాడ్డం కోసం తన మానం ఫణంగా పెడుతుంది. అయితే.. సమయానికి వైద్యం అందకపోవడంతో
ఈలోపే సారిగాడు ఆస్పత్రి అరుగుమీదే చనిపోతాడు. ఆడికిష్టమైన పుల్లట్లతో పేట మొత్తం ఘనంగా దినం
చేస్తుంది.
తాళి కట్టినోడు పరారై, ప్రేమించినోడు మన్నై వేదనతో వున్న పుల్లమ్మ తనకి లొంగలేదనే కోపంతో బ్రోతల్ కేసు
పెట్టిస్తాడు బాబూరావు. పోలీసుస్టేషన్ లోను, కోర్టులోనూ ఆమెకి అన్యాయం జరుగుతుంది. వ్యభిచారిగా
ముద్ర పడుతుంది. తాళిబొట్టును అమ్మి కోర్టులో జరిమానా కట్టి ఆ గొడవ నుంచి బయటపడుతుంది.
ఆ తర్వాత తను బతకడం కోసం పుల్లట్ల వ్యాపారం మొదలు పెట్టి... తక్కువ ధరకే అట్లు అమ్ముతూ..
ఆ అట్లు తినే వాళ్ళలో తన సారిగాడిని చూసుకుంటూ.. సారిగాడే అట్లు తింటున్నాడని అనుభూతి
పొందుతూంటుంది పుల్లమ్మ. అందుకే ఎవరికీ పార్సిల్ కట్టకూదడనే నియమం పెట్టుకుంటుంది.
అడుగడుగునా తనను కబళించాలని చూసే రాబందుల నడుమ... అపనిందలూ, అపహ్యాస్యాలను
భరిస్తూ... సారిగాడి అనుభూతులతోనే బతికేస్తుంటుంది.
గతాన్ని తలుచుకుంటూ సాయంత్రం వరకూ గోదావరిలోనే ఉండిపోయిన పుల్లమ్మ మనసును ఆ గోదారమ్మ
కూడా చల్లబరచలేకపోతుంది. రేవులో అలికిడి విని వాస్తవంలోకొచ్చిన పుల్లమ్మకు ఎదురుగా పన్ను
కట్టించుకోడానికొచ్చిన అధికారులు, రెండో భార్యగా ఉండమంటున్న ఈశ్వరయ్య కనిపిస్తారు.
నదిలోనుంచి బయటికొచ్చిన పుల్లమ్మ... ‘సూడండి బాబూ.. పన్నుకట్టి మీ ఆఫీసునే కొనగల్ను.
కానీ సిల్లిగవ్వకూడా కట్టడానికి మనసొప్పడంలేదు. నామీద కుట్రచేసి, నా సారిగాడ్ని దక్కకుండా చేసి,
ముసలోడ్ని కట్టబెట్టి, నా జీవితాన్ని నాశనం చేసింది ఓ పోలీసోడు బాబూ...’ అంటూ వాపోతుంది.
‘పోలీసోళ్ల చేతిలో పడకపోయినా యబిచారినయ్యా, సారిగాడ్ని బతిగించుకోలేక యబిచారినయ్యా, అబద్ద
సాచ్చికాలతో యబిచారినయ్యా... నన్నిసార్లు యబిచారిని చేసినోళ్ల కోసం పన్ను కట్టడం కంటే, నీ
పంచన చేరి నీతో లంజరికం సేయడమే తక్కువ యబిచారం’... అంటూ ఈశ్వరయ్య చెయ్యి
పట్టుకుంటుంది. ‘యాపారం మానేసిన నువ్వు నాకెందుకు’ అంటూ ఈశ్వరయ్య ఆమె చెయ్యి
విదుల్చుకుని వెళ్లిపోతాడు. పుల్లమ్మ నిర్ఘాంతపోయి గోదాట్లోకి చూసింది..... ఇదీ కథ.
ఈ కథకు హృద్యమైన ముగింపునిస్తాడు రచయిత. కథ పూర్తయ్యేసరికి మన మనసంతా
పుల్లమ్మే నిండిపోయివుంటుంది. మనని వెంటాడుతుంది. పుల్లమ్మ పాత్రను మలచిన వైనం మనసుని
హత్తుకుంటుంది. కథలో మనమూ పాత్రధారులమైపోతాం. ఎనభై పేజీలున్న ఈ కథ చదువుతుంటే ఓ
నవల చదువుతున్న అనుభూతి... ఓ జీవితాన్ని కళ్లముందు చూస్తున్న అనుభవం కలుగుతుంది.s
No comments:
Post a Comment