ఈ ఆదివారం (20-03-2016) సాయంత్రాన్ని మరోసారి పరిమళభరితం చేసింది. ప్రముఖ కథారచయిత్రి పి.సత్యవతి గారి కథాసంపుటి ‘సత్యవతి కథలు’ ఆవిష్కరణకు వేదికయ్యింది.
ఈ వేసవి సాయంత్రం శిఖర సాహితీ సాంస్కృతిక వేదిక సాహితీ ప్రియుల దాహార్తిని తీర్చింది.
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా గారు అష్టావధానం చేస్తే... వాసిరెడ్డి నవీన్ గారు ‘సత్యవతి కథలు’ సౌరభాన్ని ఆవిష్కరించారు. మృణాళిని, వి.ప్రతిమ వంటి రచయిత్రులతో పాటు శివారెడ్డిగారి వంటి కవులు, సాహితీ మిత్రులు ఈ సాహితీ సౌరభాలకు మరిన్ని సొభగులద్దారు.
1940 జూలై లో గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించిన సత్యవతి గారు తెలుగు,
ఆంగ్ల సాహిత్యాలను అధ్యయనం చేసిన ప్రతిభాశీలి. కథాసాహిత్య రచనలో నాలుగున్నర
దశాబ్దాలకుపైగా అనుభవం ఆమె సొంతం! ఆమె కథలు చదవడానికి ఒక కోరిక ఉంటే
మాత్రమే చాలదు. కొంచెం గుండె ధైర్యం కూడా కావాలంటారు విమర్శకులు.
సత్యవతిగారు స్త్రీల జీవితాలనే కథావస్తువులుగా చేసుకొన్నారు. గృహిణులుగా
కుటుంబాల్లో స్త్రీలు అనుభవిస్తోన్న ప్రత్యక్ష, పరోక్ష హింసలు సత్యవతి
కథల్లో హృదయాల్ని కలిచి వేసేలా ఆవిష్కృతమవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న
స్త్రీల జీవితాల్లో ఎన్ని చీకటివెలుగులో సత్యవతి కథలు చదివితే అవగతమౌతాయి.
అవివాహిత స్త్రీల అగచాట్లు, సామాజిక రంగాల్లో ఉన్న స్త్రీల స్థితిగతులు ఆమె
కథల్లో చోటు చేసుకోవడం విశేషం. నేటి సమాజంలో స్త్రీలు పురుషుల నీడలుగా ఎలా
మిగిలి పోతున్నారో, కుటుంబాల్లో భద్రత కోసం, ఉనికి కోసం, స్వేచ్ఛ కోసం
మహిళలు ఎలా తమకంటూ ఒక జీవిత విధానాన్ని ఎంచుకున్నారో వీరి కథలు తేటతెల్లం
చేస్తాయి. చెప్పాలనుకున్న విషయాన్ని సన్నని సూదితో నొప్పి తెలీకుండా
లాఘవంగా నర నరాల్లోకీ ఎక్కించే రచనలు ! కాబట్టే సత్యవతి గారి కథల్లోని
పాత్రలను గూర్చి ఒక్క పది నిమిషాలు ఆలోచిస్తే... అవి సజీవ రూపాలుగా మన
చుట్టు పక్కలే ఉన్నట్లుగా కనిపిస్తాయి. మనల్ని గురించి మనమే ఆలోచించు
కోవాలనే తపనను రేకెత్తిస్తాయి .
‘సత్యవతి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం. అది కేవలం మనసును తాకే అనుభవం మాత్రమే కాదు. మనసును తాకి, మెదడును మేల్కొలిపే అనుభవం. వారి కథల్లో స్త్రీ ప్రధానం. కానీ ఆమె కేవలం సమకాలీన నగర స్త్రీ పాత్రలనే కాదు మధ్యతరగతి స్త్రీ, చదువుకున్న స్త్రీ, నిర్లక్షరాస్యులు, గ్రామీణ నిమ్నకులాల స్త్రీలు కూడా ఈమె నాయికలే. మూడు నాలుగు పేజీల కథల్లో మూడేసి తరాల జీవితాలను వారి బాల్యం నుంచి ప్రస్తుత స్థితి వరకు వివరించడం, వారి కుటుంబంలోని ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలు ఆ స్త్రీల అణచివేతను కొనసాగించిన క్రమాన్ని, ఆ స్త్రీల ఆలోచనల్లో, ఆచరణలో రావలసిన మార్పులను అత్యంత శక్తివంతంగా చిత్రించడం ఆమె రచనా నైపుణికి నిదర్శనం. ఈ మూడు తరాల స్త్రీలు గత 60 ఏళ్ల తెలుగు జన జీవన సంప్రదాయాలకు ప్రతినిధులు...’ అని ప్రముఖ రచయిత్రి మృణాళిని గారు చెబితే... ‘సత్యవతి గారి కథలు చదవటం ఒక అనుభవం. పట్టరాని ఆనందం. కృష్ణా, గుంటూరు జిల్లాల యాసని, నుడికారాన్ని, వ్యక్తీకరణని, బ్రహ్మాండంగా పట్టుకున్నారు. ఆమె కథా పరిభాష ఆమెకొక జలం...’ అంటూ ప్రముఖ కవి కె.శివారెడ్డి గారు ప్రస్తుతించారు.
సత్యవతి గారి కథల ఆవిష్కరణ సందర్భంగా సాహితీ మిత్రుల మధ్య గడపడం... పరిమళాలను ఆస్వాదించడం... ఓ అందమైన అనుభూతిని మిగిల్చింది ఈ ఆదివారం సాయంత్రం.

No comments:
Post a Comment