ఓల్గా గారి గురించి, వారి రచనల గురించి ఇప్పటికే అనేక రివ్యూలు, ఇంటర్వ్యూలు వచ్చాయి. ఇప్పుడు నేను కొత్తగా,
ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఈమధ్య మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఓల్గా గారికి విజయవాడలో సన్మానం జరిగింది. ఆ సందర్భంగా వారి మాటలు నింపిన స్ఫూర్తితో నా స్పందనను అక్షరీకరించి... వారికి ధన్యవాదాలు తెలిపే చిన్ని ప్రయత్నమే ఇది. వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు ఓల్గా గారి రచనలు. ఓల్గా గారి రచనలలో ‘విముక్త’ ప్రత్యేకమైనదనే చెప్పాలి. 2015 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఈ పుస్తకం... ఇప్పటికే కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, నేపాలీ భాషలలోకి అనువాదమైంది. ఒక తెలుగు రచన ఇన్ని దేశీయ భాషలలోకి అనువదించబడడంసామాన్యమైన విషయం కాదు. ఇది ఈ పుస్తకానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
సమాగమం, మృణ్మయనాదం, సైకత కుంభం, విముక్త... ఈ నాలుగు కథలలో శూర్పణఖ నుండి శ్రమైక సౌందర్యానందం, అహల్య నుండి అధికార స్వభావం, రేణుక నుండి విద్యావశ్యకత, ఊర్మిళ నుంచి బంధ విముక్తం... నేర్చుకొన్న సీత.. తన బంధాల నుండి విముక్తం కావడం కోసం తనతో తాను పోరాటం చేస్తుంది. పాతివ్రత్యం, మాతృత్వం చాలా గొప్పవనుకొనే సీత.. శూర్పణఖ, అలహ్య, రేణుక, ఊర్మిళ జీవితాల నుంచి స్ఫూర్తిని పొందుతుంది. తాను ఎంచుకొన్న కథావస్తువును స్త్రీవాదదృక్కోణంతో మాత్రమే గాక పురాణాలను ఎక్కడా కించపరడంగానీ దురభిప్రాయం కలిగేలా చేయడం గానీ లేకుండా తనదైన శైలిలో అక్షరీకరించారు.
ఒకానొక భావోద్రేకం గుండెను కుదిపినప్పుడు, మాటలు కదలాడి గొంతు విప్పుకొని వెలువడతాయి. ఆ మాటల కూర్పులోని నేర్పు, తీర్పు, ఒద్దిక, లయ, సహజత్వం, భావుకత్వం ఓల్గా అక్క సొంతం. ఈ కథలలో ఎక్కడా పురుష ధ్వేషం కనబడదు. స్త్రీవాదం అంటే పురుషవ్యతిరేకత కాదు... స్త్రీల అస్తిత్వ అన్వేషణ మాత్రమే. అంతేకాకుండా ఈ పాత్రల మధ్య జరిగే మానసిక సంఘర్షణలోనూ ఓ సమీప్యతకనిపిస్తుంది. అహల్య, రేణుక, సీత అనుమానితలే... అవమానితలే. తొణికిసలాడే వ్యక్తిత్వాన్ని, వారి మానసిక సంఘర్షణను హృద్యంగా వర్ణించిన సృజనశీలి ఓల్గా.
విముక్త కథలలో శూర్పణఖ పాత్ర నాకు బాగా నచ్చింది. అలాగని అహల్య, ఊర్మిళ, రేణుకల పాత్రలనూ తక్కువ
చేయలేం. పురాణ కథల్లో పెద్ద గుర్తింపు లేని ఈ పాత్రలు ఓల్గా కథల్లో ప్రధాన భూమికను పోషిస్తాయి. చదువరుల మన్ననలు పొందుతాయి. అయితే శూర్పణఖ గురించి ‘సమాగమం’ కథలో రాముడు పరిత్యజించిన తర్వాత వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందిన సీత అనుకోని పరిస్థితుల్లో కురూపిగా మారిన శూర్పణఖను కలుసుకుంటుంది. ‘రామ లక్ష్మణుల క్రూర పరిహాసానికి’ శూర్పణఖ కురూపిగా మారిందని విచారిస్తుంది సీత. శూర్పణఖను రాముడు అవమానిస్తే.. రావణుడు తనను అపహరించి ప్రతీకారం తీర్చుకున్నాడు.
‘పురుషుల పగలూ ప్రతీకారాలు తీర్చుకోవడానికేనా స్త్రీలుంది’ అని సీత ఆవేదన చెందుతుంది. ఇది ఆమె అవగాహనకు, చైతన్యానికి తొలిమెట్టు. ఈ క్రమంలో వారి మానసిక సంఘర్షణను వర్ణించిన తీరు సానుభూతిని, ఇష్టాన్నీ కలిగిస్తుంది. ద్వేషం, అశాంతితో మండిన మనసులో ప్రేమను నింపుకొంది. తనను ప్రేమించమని అడిగినందుకు తమ్ముడిచేత ముక్కు చెవులు కోయించి శూర్పణఖను కురూపిగా మార్చాడు రాముడు. తనను ప్రేమించనందుకు అమ్మాయిలపై యాసిడ్ దాడులకు దిగుతున్నాడు నేటితరం యువకుడు. నాటి నుంచి
నేటివరకూ స్త్రీల చరిత్ర బాధితుల చరిత్రే. ఈ కథలోని ప్రతి మాట వెనుక లోతైన ఉద్వేగం... విస్తృతమైన భావన కదలాడుతుంది.
‘మృణ్మయనాదం’ కథ... అహల్య గాథ. ఆ నాదంలో సీత గొంతు అంతర్భాగం. స్త్రీని పురుషుడు తన వ్యక్తిగత ఆస్తిగా,
వస్తువుగా భావించి... ఆమెపై అధికారం, యజమానిత్వం గల దృక్పథాన్ని విభేదిస్తుంది అహల్య. ‘మగవాళ్లందరూ ఒక్కటే సీతా.. భార్యల విషయంలో’ అంటూ హితబోధ చేస్తుంది. ఎవరి సత్యం వారిది, సత్యాసత్యాలు నిర్ణయించగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా వుందా? అంటూ నిలదీస్తుంది అహల్య. నేనివ్వనంత వరకూ ఎవరూ నామీద అధికారాన్ని పొందలేరు... అంటూ పురుషాధిక్యతను సవాల్ చేస్తుంది. మనమీద మనకున్న అధికారం మనల్ని ఆత్మ విశ్వాసంతో నింపుతుంది. మన నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగు పరుస్తుంది. ఎన్నడూ
విచారణకు అంగీకరించకు, అధికారానికి లొంగకు.. అంటూ సీతకు మార్గనిర్దేశం చేస్తుంది. ‘సైకత కుంభం’ కథ పాతివ్రత్యం అనే భావనలోని డొల్లతనాన్ని బద్దలుకొట్టిన కథ. జమదగ్ని మహర్షి భార్యగా, పరశురాముడి తల్లిగా లోకానికి తెలిసిన రేణుకా ఓ అపురూప శిల్పకారిణి. విశిష్టమైన సైకత కుంభాలను తయారు చేయగలిగే కళాకారిణిగా ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఆర్య ధర్మంలో ప్రధానమైన పితృ వాక్య పరిపాలనకు రాముడు ఒక కోణం అయితే... పరశురాముడు రెండో కోణం. ఈ రెండు కోణాలు ఇద్దరు స్త్రీలకు ఏం మిగిల్చాయో చెప్పే కథ ఇది. పాత్రివ్రత్యం , మాతృత్వ భావనల చుట్టూ స్త్రీల జీవితాలను ఓ ఉచ్చులో బిగించిన పురుషస్వామ్య సంస్కృతిలోని కుట్రను, డొల్ల తనాన్ని బయటపెడుతుంది రేణుక. ‘భర్తల గురించి, కుమారుల గురించి నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు’ అంటుంది రేణుక. ఈ వ్యాఖ్యకు ఆమె నవ్వు‘నురగలై తేలుతోంది’ అంటూ మరో చిన్నవాక్యాన్ని జోడించారు ఓల్గా. రేణుక నవ్వులో చాలా అర్థాలున్నాయని కథ మొత్తం చదివాక తెలుస్తుంది. రేణుక తన అనుభవం ద్వారా
గ్రహించిన సత్యాన్ని సీతకు చెబుతుంది. ‘భర్త తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటారు స్త్రీలు. కానీ ఏదోక రోజు భర్త తన ప్రపంచంలో నీకు చోటులేదంటాడు...’ అప్పుడు మనకు ఏ ఆధారం వుంది అంటూ తనకు అనుభవమైన సత్యాన్ని సీతకు వివరిస్తుంది రేణుక. ‘మీకు అలా జరిగింది కాబట్టి ప్రపంచంలో భర్తలు, కుమారులు అందరూ ఆలాగే వుంటారని అనుకోవడం న్యాయం కాద’ని అంటుంది సీత. కానీ ఆ తర్వాత రేణుక హెచ్చరించిన రెండు సందర్భాలూ సీత జీవితంలో కూడా ఎదురయ్యాయి. అప్పటి సీత మానసిక సంఘర్షణకు ఓల్గా చూపిన పరిష్కారం
ఏమిటో ఈ కథలో చూడొచ్చు.
‘విముక్త’ కథలో తన భర్త లక్ష్మణుడు తనకు మాట మాత్రం చెప్పకుండా రాముడితో వనవాసానికి వెళ్లడం ఊర్మిళ
అహాన్ని... అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. తనను తాను గదిలో బందించుకుంటుంది. పద్నాలుగేళ్లు సత్యశోధనలో నేను చేసిన గొప్ప తపస్సును నిద్ర అనుకున్న వాళ్లకు నా మాటలు అర్థమౌతాయా? అంటూ ప్రశ్నిస్తుంది. ‘ప్రతి పరీక్షా నిన్ను రాముడి నుంచి విముక్తం చేయడానికే. నిన్ను నీకు దక్కించడానికే. యుద్ధం చెయ్యి. తపస్సు చెయ్యి. లోపలికి చూడు... నీవనే యథార్థం కనబడేదాకా చూడు..’ అంటూ సీతకు వివరిస్తుంది. సీత తనకు తాను విముక్తం కావడానికి దోహదం చేస్తుంది. ఈ నాలుగు కథలతో పాటు ‘బంధితుడు’ పేరుతో రాముడికి వున్న పరిమితులను అర్థవంతంగా విశ్లేషించారు ఓల్గా.
ఓల్గా గారు ఎంచుకున్న కథా వస్తువు ఎంత పాతదో.. అంతే కొత్తది. ఎప్పటికీ కొత్తగానే వుంటుందేమో. అలాంటి సందర్భాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఎదురవుతూనే వుంటాయి. స్త్రీలు తమ సహజ లక్షణాలన్నింటినీ చంపుకొని పాతివ్రత్యం గడుపుదామనుకున్నా... దాన్ని పురుషులు సాగనివ్వరని రామాయణమే స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. అనసూయను కూడా పరీక్షపేరుతో త్రిమూర్తులే వదలలేదు. మహిళల మానసిక సంఘర్షణకు సజీవ రూపాలు ఈ కథాసంపుటిలోని ఓల్గా పాత్రలు. మళ్లీ మళ్లీ తన పాతివ్రత్యాన్ని రుజువు చేసుకొనే ఈ అపనమ్మక బంధమే వద్దనుకుని భూమాత దగ్గరికి వెళ్లిపోతుంది సీత. ఇలాంటి ఆత్మవిశ్వాసం నేటి మహిళకు అవసరం.
No comments:
Post a Comment