సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం…
అంటూ... తన మృదు మధుర గానంతో
ఎందరో మనసులను దోచుకున్న సుమధుర గాయని సునీత...
కాలం చేసిన గాయం గేయమై స్రవిస్తున్నా..
వాసంత సమీరంలా తన చుట్టూ ఉన్నవారిని
తన గానంతో అలరిస్తూ...
తాను మాత్రం కొవ్వొత్తిలా కరుగిపోతూ..
గుండెలో భడబాగ్నులు రగులుతున్నా
చెదరని చిరునగవుతో గానామృతాన్ని పంచుతోన్న
కడలితరంగం సునీత.
రెండ్రోజుల క్రితం సాక్షి పత్రికలో సునీత గారి ఇంటర్వ్యూ చదివిన తర్వాత
తనపై ఉన్న అభిమానం రెట్టింపయ్యిందని చెప్పడానికి గర్విస్తున్నా..
ఇన్నేళ్ల మా స్నేహంలో ఏనాడూ బాధపడుతున్నట్లుగానీ..
నిరుత్సాహంగా... నిర్వేదంగా కనిపించడంగాని లేదు..
అంతటి స్థితప్రజ్ఞత ఆమెకే సాధ్యమైంది.
అంత చిన్న వయస్సులో ఇంతటి వేదనను భరిస్తూ...
దాదాపు ఇరవై ఏళ్లుగా ఒంటరిపోరాటం చేస్తూ
గృహిణిగా, తల్లిగా, ఇంట్లోని పెద్దల పట్ల ఆదరణ కర్తగా
ఒక బృహత్తరమైన పాత్రను పోషిస్తూ..
సినిమా రంగంలో రాణించడమంటే..అది సునీత గారికే సాధ్యమైంది.
అలసట ఎరుగని నిత్య కృషీవలి సునీత.
మనిషిని నమ్మడం మానవత్వం..
నమ్మినవారిని వంచించడం అమానుషత్వం...
తనను తాను గొప్పవాడిగా, సచ్ఛీలుడిగా చిత్రించుకోవడం
ఎదుటివారిపై ఛీప్ ట్రిక్స్ ప్లే చేయడం
మానసిక దౌర్భల్యులు చేసే దుశ్చర్యలు మాత్రమే...
ప్రేమ పేరుతో సానుభూతికోసం వెంపర్లాడడం కొందరికే చెల్లుతుంది.
ఒక సెలబ్రిటీగా ఉన్న మీరు... పనీపాటా లేనివారు సృష్టించే రూమర్లకు
ఎంత వ్యధ చెందివుంటారో నేను ఊహించగలను.
చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించే స్వభావం
ఆధిపత్య భావజాలం నరనరానీ జీర్ణించుకుపోయిన సమాజంలో మనమున్నాము.
‘ఎదలోని రాపిడిలోనా కదలాడు నురగలపైనా
కలకల నవ్వులున్నాయో కన్నీళ్ళు పొంగుతున్నాయో
తెలిసేదెవరికీ...
గుండె ముక్కలైపోయీ సుడిగుండాలే చెలరేగీ
కల్లోలం విషమించినా కాలమే వంచించినా
ఆగిపోదు నీ నడకా ఆ గమ్యం చేరేదాకా...’
అని ఓ కవి చెప్పినట్టుగా
దృఢచిత్తంతో... మొక్కవోని దీక్షతో ముందుకు సాగిపో..
కష్టసుఖాలు.. చీకటివెలుగులు. ఎప్పుడూ ఒకేలావుండవు.
నిన్నభిమానించే వేలాది మందితో పాటు...
నీ స్నేహితులమైన మేమంతా నీకు తోడుగా వున్నాం
ఎంతటి కష్టంలోనూ...
ముఖాన చిరునవ్వు చెరగనీకు
మనోనిబ్బరాన్ని సడలనీకు నేస్తం.
No comments:
Post a Comment