Social Icons

Monday, September 26, 2016

పేగుబంధం

Posted: August 23, 2016

నవమాసాలు మోసినప్పుడు
బుజ్జి బుజ్జి కాళ్లతో కడుపున తట్టినప్పుడు
ఆ అనుభూతిని ఏమని వర్ణించాలి
అందుకు ఏ భాషలోని అక్షరాలు సరిపోతాయి...

భరించలేని నొప్పులతో విలవిల్లాడినప్పుడు
పేగు తెంచుకు పుట్టినప్పుడు
నిను చూసి కలిగిన అనుభూతిని ఏమని వర్ణించాలి
అందుకు ఏ భాషలోని పదాలను పోగెయ్యాలి...
నేననుభవించి అనుభూతిని ఏమని వర్ణించాలి
అందుకు ఏ భాషలోని వాక్యాలు సరితూగుతాయి....
అమ్మ ఒడిలో దాగినప్పుడు
బోసినవ్వులు పంచినప్పుడు
నా కాళ్లనే ఊయలగా మార్చినప్పుడు
నా సంతోషాల వెల్లువ జోల పాటలా పొంగినప్పుడు
ఏ భాషలోని భావం ఆ అనుభూతిని వర్ణించగలదు...
బుడిబుడి అడుగులతో నట్టింట నడయాడినప్పుడు
ముద్దుముద్దు పలుకులతో ఊసులాడినప్పుడు
చిట్టిపొట్టి కథలను నీతో పంచుకున్నప్పుడు
ఆ ఆనందాన్ని ఏ కవి మాత్రం వర్ణించగలడు...
రోజురోజూ ఎదిగే నిన్నుజూసి
చక్రాల్లాంటి ఆ కళ్లలోని మెరుపులనుజూసి
నీ మాటల్లోని ఆత్మవిశ్వాసంజూసి
ఎంత ఎదిగిపోయావోనని
ఉద్వేగంతో చెమర్చిన కన్నీటి తడిని
అందులోని గాఢతను కొలవడానికి ఏ కొలమానం సరిపోతుంది....
స్కూలుకు పంపిన మొదటిరోజు
పెళ్లికూతుర్ని చేసిన అప్పగింతలనాడు
చీరసారెలతో అత్తవారింటికి పంపినరోజు
నేననుభవించిన ఎడబాటును... వేదనను
తడియారని కన్నీటి చెలమలను వర్ణించడానికి
ఎన్ని భాషల్లోని అక్షరాలు సరిపోతాయి....
బాధను...
ఎడబాటును....
వేదనను...
అనుబంధాన్ని...
ప్రేమ బంధాన్ని...
వర్ణించడం ఎవరికి మాత్రం సాధ్యమౌతుంది.... మరో తల్లికి తప్ప.
****
ఏ తల్లికైనా కూతురితో ఉండే అనుబంధం ప్రత్యేకమైనది
అన్ని సందర్భాల్లోనూ వ్యక్తం కాకపోవచ్చు... కానీ
ఆ పేగుబంధం మెలిపెడుతూనే వుంటుంది...
ఇదంతా ఎందుకంటే...
రెండ్రోజుల క్రితమే నా కూతురు ఇలా వచ్చి... అలా వెళ్లింది.
నా ప్రాణం నన్నువీడిపోయినట్టనిపించింది
ఏదో వేదన నన్నావరించింది
నా చిన్నారి మహిత కళ్లముందు కదలాడింది
తనతో తొలి ఎడబాటు మొదటిరోజు స్కూలుకు వెళ్లినప్పుడు.
మళ్లీ తనొచ్చేవరకూ ఎంత విలవిల్లాడానో...
మళ్లీ అలాంటి సందర్భమే తన పెళ్లిరోజున అప్పగింతలప్పుడు..
అందరూ నవ్వులూ కేరింతలతో పెళ్లి సందడిలో వుంటే...
తుఫాను ముందు ప్రశాంతతలా గదిలో ఒక్కదాన్నే...
నన్ను పిలవడానికొచ్చిన అన్నయ్య... ఏమిటమ్మా అలా వున్నావు అని...
అనీ అనగానే... హృదయం సునామీలా పెల్లుబికింది
కళ్ల నుండి జలపాతమై పొంగింది....
బావురుమంటూ అన్నయ్యను పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చిన నాటి జ్ఞాపకం మళ్లీ..మళ్లీ...
ఇప్పుడూ అదే... కళ్ళ నుండి జలపాతం మళ్లీ మళ్లీ..
బిడ్డలు ఎంత ఎదిగినా పొత్తిళ్లలో బిడ్డేగా... ఏ తల్లికైనా

అయినా తప్పని ఎడబాటు...
జీవితంలో కొంత వరకు మాత్రమే పిల్లలే ప్రపంచంగా వుంటుంది
వాళ్ల జీవితాలను వాళ్లే నిర్మించుకోవడం మొదలుపెట్టినప్పుడు
అదో పరిణామక్రమం అని సరిపెట్టుకోవాల్సిందే...
పిల్లలు జీవితంలో ఒక భాగం మాత్రమేననే విషయాన్ని
జీర్ణించుకోవాలంటే... ఎందుకో తెలియని బాధ...
ఇదొక జీవనచక్రం... సమాజ పరిణామక్రమం
ఇది తెలిసి కూడా ఆగని కడుపుతీపి...భావోద్వేగం
ఈరోజు మనం...
రేపు మన పిల్లలు..
ఆ తర్వాత వాళ్ల పిల్లలు..
ఇది తరతరాలుగా నడుస్తున్న చరిత్ర...
అందులో మనం ఒక భాగం మాత్రమే..
Pic courtesy :
 Srinivasa Chowdary Gundarapu. Best of our memories captured through your camera eyes. 
Thanks a lot for that.💐

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates