
పండువెన్నెల్లో విహరిస్తున్న అనుభూతిని కలిగించేవీ..
మళ్లీ మళ్లీ చదవాలనిపించేవీ...
ఒక సందేశం, ఇన్ స్పిరేషన్ ఇచ్చేవీ..
వ్యక్తిగత లైబ్రరీలో దాచుకోదగినవీ...
ఇలా... అనేక రచనలున్నాయి.
వాటిలో ‘నల్లంచు తెల్లచీర’ నవల ఒకటి.
వీధుల వెంట తిరిగి చీరలమ్ముకునే ఓ కుర్రవాడు బడా వస్త్రవ్యాపారులపై సంధించిన అస్త్రం.
నిబిడీకృతమైన తెలివితేటలకి బహుమతిగా జీవితపు తొలిముద్దు...
కీలక మలుపునకు దారితీసిన అదే ముద్దు...
చీరలు కట్టడంలో ఆరితేరిన వారికి కూడా చీర మెళకువల చిత్రాతిచిత్రాలు నేర్పిన చమత్కారం...
భార్యా భర్తల మధ్య కమ్యూనికేషన్ ఎంత సున్నితంగా వుండాలో చెప్పే వ్యక్తిత్వ వికాసం.
జీవితంలో కోల్పోయిన మాధుర్యం కోసం అర్రులుచాచి ప్రత్యర్ధుల వలలో చిక్కుకున్న వైనం.
తన వృత్తిలో కష్టపడి పైకి పైకి ఎదుగుతున్న భర్తకు... భార్యనుంచి ఎలాంటి ప్రోత్సాహం
అవసరం...
ఇంటినీ, భార్యను పట్టించుకోని భర్త నుంచి భార్య ఏం కోరుకుంటుంది....
వంటి సున్నితమైన అంశాలను గుదిగుచ్చి.... రంగురంగుల దారాలుగా పేని..
అక్షరాల మగ్గంపై తన రచనా శిల్పంతో యండమూరి నేసిన ఓ మంచి నవల ‘నల్లంచు
తెల్లచీర’.
వెయ్యి రూపాయల చీరని 8ఏళ్లు దాచిదాచి కట్టుకోవడం కంటే...
ఎనిమిది వేర్వేరు చీరలను కొని కట్టుకుంటే ఆకర్షణీయంగా కనబడతారనీ,
అలా ఆకర్షణీయంగా కనబడాల్సింది... పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో మాత్రమే కాదు..
ఇంట్లో భర్తకి కూడా ఆకర్షణీయంగా కనబడాలంటాడు రచయిత.
చీరకు ధర ముఖ్యం కాదు... కొట్టొచ్చేటట్టు కనబడడం ముఖ్యం...
అందుకు తమ తమ శరీరతత్వాన్ని అర్థం చేసుకోవడం మరింత ముఖ్యం..
చీర అందంగా కట్టుకోవడం ఎంత గొప్ప కళో,
సీజన్ ను బట్టి అందమైన చీరని ఎన్నిక చేసుకోవడమూ అంతే గొప్ప కళ...
చీర శరీరాన్ని కప్పే సాధనం కాదు... శరీరానికి అందం తెచ్చే ఆయుధం...
ఓ ఆడవాళ్లలారా... ఈ విషయాలన్నీ మీరెప్పుడు తెలుసుకుంటారు అంటూ...
అనేక ప్రశ్నలను... సందేహాలను రచయిత లేవనెత్తుతారు ఈ నవలికలో...
***
కథలోకి వెళితే...
పల్లెటూరిలో ఎంత అమ్మినా చీరలు ఎక్కువగా అమ్ముడు కావడం లేదని...
పట్నంలో ఐతే బాగా అమ్మవచ్చని మేనమామను వొప్పించి విజయవాడ తీసుకొనస్తాడు రవి.
ఎర్రటి ఎండలో చీరలు... చీరలు... అంటూ గొంతు పగిలేలా అరుస్తున్నా... వీధి వీధి
తిరుగుతున్నా ఒక్క చీరా అమ్ముడు పోదు. ఆ ఎండలో తిరగలేక ఒక వీధి అరుగుపై
కూలబడతాడు మేనమామ. రవి మాత్రం ‘చీరలు... చీరలు’ అని కేకలేస్తూ వీధులన్నీ
తిరుగుతాడు. కాని ఒక్క చీర కూడా అమ్మలేకపోతాడు .
‘చీర నేసేవాడికి ఆడవాళ్ళ హృదయం అద్దంలా చదివే నేర్పుండాలనీ...
ఏ రంగు మీద ఏ అద్దకం అందం యిస్తుందో తెలుసుకోవాలంటే...
ఏ పువ్వు ఏ భావానికి అర్థమో చెప్పగలిగే భావుకత్వం వుండాలి...’
అందుకే... రోడ్ల వెంట తిరుగుతూ చీరలు అమ్మలేమనే నిర్ణయానికొస్తాడు. తన అమ్మకం స్టైల్
మార్చుతాడు. అందులో భాగంగానే... ఎమ్మెల్యే గారి ఇంటికి వెళతాడు. ఆ సమయంలో
వారింటో్ల మిస్ విజయవాడ పోటీలకు ఎమ్మెల్యే కూతుర్ని ముస్తాబు చేసి, రిహర్సల్స్
చేస్తుంటారు. అక్కడెవరీ సంతృప్తి కలగదు. ఆ సమయంలో ఆ ఇంటికొచ్చిన రవి... వారి
హడావుడి అంతా గమనించి వారి అమ్మాయిని వప్పించి, మెప్పించి నల్లంచు తెల్లచీరను
ఆమెకు అమ్ముతాడు. రవి సూచనల మేరకు ముస్తాబైన ఆమె మిస్ విజయవాడగా
ఎంపికవుతుంది. పోటీలకు వెళ్లేముందు తన అందానికి ముగ్దురాలైన ఆమె... అందుకు
కారణమైన రవి పెదవులపై జీవితంలో తొలి ముద్దు పెడుతుంది. ఈ పరిచయం తర్వాత కీలక
మలుపుకు కారణమవుతుంది.
చీర అమ్మిన ఆనందంలో మేనమామ దగ్గరకు వచ్చేసరికి వడగాలికి, ఆకలికి తట్టుకోలేక
కొనఊపిరితో చివరిక్షణంలో వుంటాడాయన. తన కూతురు మాధవిని పెళ్ళి చేసుకోవాలని
కోరుతూ.. రవి దగ్గర మాట తీసుకొని కన్నుమూస్తాడు. మేనమామ కోరిక మేరకు మాధవిని
పెళ్ళిచేసుకొంటాడు. ఈ క్రమంలో ఒక బట్టల షాప్ లో సేల్స్ బాయ్ గా చేరతాడు. ఆ షాప్
షోకేస్ లో బొమ్మకు చీర కట్టిన నైపుణ్యం ఓ పెద్ద వస్త్రవ్యాపారి, తేజా టెక్స్ టైల్స్ యజమాని
అయిన శర్మను ఆకర్షిస్తుంది. ఆ షాపులోకి వచ్చిన శర్మ బొమ్మకు చీరకట్టింది ఎవరో
తెలుసుకుంటాడు. అలా శర్మకు, రవికి తొలి పరిచయం జరుగుతుంది. అదే సమయంలో
మిస్ విజయవాడ కూడా రెండోసారి రవిని చూస్తుంది. అయితే అనుకోని కారణం వల్ల రవి ఆ
ఉద్యోగం పోగొట్టుకుంటాడు.
ఇక ఉద్యోగం వల్ల కూడా లాభం లేదని సొంతగా ఆప్లిక్ వర్క్ చీరలను అమ్మడం ప్రారంభిస్తాడు.
ఈ క్రమంలోనే రెండోసారి రవిని చూస్తాడు శర్మ. అనంతరం రవిని తన పార్టనర్ గా
చేసుకుంటాడు. తేజా టెక్స్ టైల్స్ ఆ తర్వాత రవితేజా టెక్స్ టైల్స్ గా మారుతుంది. ఎవరికి
ఎలాంటి చీరనప్పుతుందో, ఎవరు ఎలా చీరకట్టుకుంటే బాగుంటారో అలా చూసి... ఇలా
చెప్పగల నైపుణ్యం రవిది . ఆ నైపుణ్యంతో.... తన తెలివితేటలతో కంపెనీని వృద్దిలోకి
తెస్తాడు. వ్యాపారం దినదినాభివృద్ది చెందుతుంది. డబ్బుతో పాటు మంచిపేరు ప్రఖ్యాతులు
సంపాదిస్తాడు.
వ్యాపారంలో అతి తక్కువ సమయంలో అత్యంత పేరు సంపాదించిన రవికి ఇంట్లో మాత్రం
భార్య మాధవి దగ్గర నుంచి సరైన ప్రోత్సాహం వుండదు. రవి తనను పట్టించుకోవట్లేదని తీవ్ర
అసంతృప్తికి గురవుతుంది. దీంతో ఇంట్లో అశాంతి... ఇద్దరికీ ఎప్పుడూ గొడవలే. ఈ
నేపథ్యంలో మిస్ విజయవాడ పేరుతో రవికి ఒక ఉత్తరం వస్తుంది. తాను ఏ పరిస్థితిలో
ఉత్తరం రాయాల్సి వచ్చిందో వివరిస్తుంది. పదిహేనేళ్ల క్రితం తనకు తొలి ముద్దు మాధుర్యం
అందించిన ఆ స్త్రీమూర్తి సజీవాకృతి ఇంకా అతడి మనోఫలకంపై చిత్రించబడేవుంది. అప్పటి
వరకూ అదో జ్ఞాపకం. ఈ ఉత్తరం తర్వాత ప్రశాంతంగా ఉన్న తటాకంలో ఏర్పడిన తరంగాలు.
జీవితంలో శూన్యత విలువ అనుభవించినవారికే తెలుస్తుంది. ఆ మిస్ విజయవాడే... రవికి
వ్యాపార భాగస్వామి శర్మ భార్య. ఆమె తండ్రి పదవి పోయి, దివాళా తీసి, క్లిష్ట పరిస్థితుల్లో
వయసులో పెద్దవాడైన శర్మకు రెండో భార్యగా వస్తుంది. ఆమె రవికి తెలీకుండా రవిని
గమనిస్తూ వుంటుంది. ఆ క్రమంలో వచ్చిందే.. ఆ ఉత్తరం. కానీ ఉత్తరంలో చెప్పిన ప్రకారం
రవి, మిస్ విజయవాడ కలుసుకోలేకపోతారు. ఈ పరిస్థితిని రవి తట్టుకోలేకపోతాడు.
గుండెల్లో చిలికినట్లవుతుంది. బలహీనతలకు అతను అతీతుడేమీ కాదు. తనలో నిద్రాణమైన
వున్న దాహాన్ని ఒక స్త్రీ మేల్కొలిపితే... మరో స్త్రీ ఉరకలు వేయిస్తుంది. అది రెండు శరీరాల
కలయిక కోసం తహతహ కాదు. స్త్రీ పురుషులకు అవతలివారి దగ్గర దొరికే ఓదార్పు...
గుర్తింపు. ఆ ఓదాప్పు కోసం కొత్తగా తనకు సెక్రటరీగా వచ్చిన ప్రియంవద ఆలంబన
అవుతుంది.
ఇదే సమయంలో మాధవి ఒంటరితనాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు స్నేహం
పేరుతో సుధాకర్ దగ్గరవుతాడు. వ్యాపారపు పనిమీద రవి అమెరికా వెళ్ళివచ్చేసరికి మాధవి
హత్య చేయబడుతుంది. ఆ హత్య రవే చేసినట్లుగా అన్ని సాక్ష్యాలూ రుజువు చేస్తాయి. దీంతో
అండర్ గ్రౌండ్ కి వెళ్లిన రవిని దేశం దాటించే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో మళ్లీ
మిస్ విజయవాడ ఫోన్ కీలకంగా మారుతుంది. అసలు సూత్రధారి ఎవరో తెలుస్తుంది.
మాధవిని హత్య చేసింది రవి కాదని పోలీసులు ఆధారాలు సంపాదిస్తారు. దీంతో కథ
సుఖాంతం అవుతుంది.
***
ఈ నవల మొదట ఆహ్లాదకరంగా ప్రారంభమై అనేక మలుపులు, ట్విస్టుల మధ్య
ముగుస్తుంది. కథలోని ఉత్కంఠత ఎక్కడా పట్టుసడలకుండా చివరికంటా నడపడంలో
రచయిత కృతకృత్యుడయ్యాడు. ప్రతి లైనూ ఏకగ్రతగా చదివిస్తుంది. ముఖ్యంగా ఈ నవలలో
ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇద్దరు ప్రత్యర్థులు. ప్రత్యక్ష ప్రత్యర్థి ఒకరు... పరోక్ష ప్రత్యర్ధి
మరొకరు. ఎత్తుకు పై ఎత్తుల మధ్య కథ రసవత్తరంగా నడుస్తుంది. మాధవిని
హత్యచేసిందెవరనే ఉత్కంఠను చివరికంటా కొనసాగిస్తారు. ఇక మిస్ విజయవాడ, మాధవి,
ప్రియంవద పాత్రల వ్యక్తిత్వ చిత్రణ వైవిధ్యంగా వుంటుంది. ముఖ్యంగా మిస్ విజయవాడ
పాత్ర.
‘ఒక వివాహిత ఇలా రాయడాన్ని సమాజం హర్షించదు. డబ్బుకోసం కూతుర్ని
ముసలాడికిచ్చిన సమాజం... వ్యసనంలో భార్యని నిర్లక్ష్యం చేసిన సమాజం.. దీన్ని గౌరవించే
ఓపిక నాకు పోయిందంటూ..’ సమాజ వైచిత్రి ప్రశ్నిస్తుంది మిస్ విజయవాడ. ‘ప్రతి స్త్రీ చుట్టూ
ఒక నైతిక విలువల లక్షణరేఖ వుంటుంది. దీన్ని పురుషుడుగానీ, సమాజంగానీ
నిర్మించలేదు. స్త్రీ తన చుట్టూ తానే ఏర్పరచుకుంది. దీన్నించి బయటపడటం అంత తేలిక
కాదు...’ అంటూ ఆ చట్రంలోనే కూరుకుపోతుంది. ఈ పాత్ర చిత్రణ తొలి నుంచి చివరి వరకూ
వ్యక్తిత్వము... నైతికత... సామాజిక కట్టుబాట్లు మధ్య పోరాటం చేస్తుంటుంది. దాంతోపాటు
భార్యా భర్తల మధ్య కమ్యూనికేషన్ ఎంత సున్నితంగా వుండాలలో వివరిస్తాడు. ఒకే దిండుపై
ఉండే రెండు తలలు ఉత్తర, దక్షణ ధృవాలుగా ఉండరాదనే విధంగా కౌన్సిలింగ్ ఇస్తాడు
రచయిత. ముఖ్యంగా చీరలు వాటి రంగుల గురించి వర్ణన అద్భుతంగా వుంటుంది.
ఎటువంటి పర్సనాలిటీకి ఎలాంటి చీరకట్టుకుంటే బాగుంటుందో బాగా వివరించారు. ప్రతి
మహిళా తప్పనిసరిగా చదవాల్సిన నవల ఇది. తొలుత ఇది 106 రోజుల పాటు
ఆంధ్రజ్యోతిలో డైలీ సీరియల్‌గా వచ్చింది. ఇదే నవలను ‘దొంగమొగుడు’ పేరుతో చిరంజీవితో
సినిమాగా కూడా వచ్చింది. ఈ నవలను ఒకసారి చదివితే... చీరెల గురించి ఇంతుందా? అని
ఇంతులంతా మైమరచిపోవడం ఖాయం.
No comments:
Post a Comment