Social Icons

Friday, April 1, 2016

యండమూరి తరహా విశ్లేషణే ఈ ‘ప్రేమ’

ఆమె పేరు వేద సంహిత!
అపురూప సౌందర్యవతి
ఆమెను సృష్టించిన బ్రహ్మ కూడా ఆమె సౌందర్యానికి ముగ్దుడవుతాడు.
‘ఈమె కురులు హటకాంబురుహ చంచరీ కోత్కరంబులు...
ఈమె ఊరువులు సహజ గంధ పరిమళ పరివేష్టితమ్ములు’ అని
అశువుగా కవిత్వం చెప్పి భార్యతో మొట్టికాయ తింటాడు.
అంతేనా... వారిద్దరి తగవు తీర్చడం నారదుడి వంతు అయ్యింది.
వారి తగవుల ఫలితం...
వేదసంహిత వైవాహిక జీవితం
ఆమె మెడ మీద భర్త పెట్టిన కత్తి గాటునే మిగిల్చింది.
* * *

మెరుపులేని ఉరుములా... మేఘంలేని వర్షంలా
ఏమిటీ ఉపోద్గతం అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నా..
ఈమధ్యనే యండమూరి వీరేంద్రనాథ్ ‘ప్రేమ’ నవల చదివాను.
తొలుత ఆంధ్రభూమి వారపత్రిక నలుగురు ప్రముఖ రచయితలతో 'ప్రేమ' అనే నవలకు
శ్రీకారం చుట్టింది.
నలుగురూ భిన్న కథాంశాలు ఎన్నుకొని, ప్రేమని ఎలివేట్ చేస్తూ...
ఎవరి కోణంలో వారు రాసిన కథలను ఒక పుస్తకంగా ప్రచురించారు.
ప్రస్తుతం యండమూరి ‘ప్రేమ’ నవలను ప్రత్యేకంగా చిన్న పుస్తకంగా ప్రచురించారు.
ఆ పుస్తకం చూసిన తర్వాత మళ్లీ చదవాలనిపించింది....
చదివిన తర్వాత నా అనుభూతిని మిత్రులందరితో పంచుకోవాలి కదా....
అందుకే నా అభిప్రాయాలను అక్షరాలుగా ఇక్కడ పేర్చుతున్నా...
* * *
ఇక ఈ ‘ప్రేమ’ కథలోకి వెళితే....
బ్రహ్మచే అద్భుతంగా సృష్టించబడిన అందమైన అమ్మాయి వేదసంహిత.
అద్దె ఇల్లు కోసం ఆదిత్యపురం అనే గ్రామానికి రావటంతో కథ ప్రారంభం అవుతుంది.
అంత అందమైన ఒంటరిగా రావడంతో ఆశ్రయం ఇవ్వటానికి అంతా సందేహిస్తారు.
ఆమె అందానికి ముగ్దుడైన చలం అనే యువకుడు ఈ పల్లెటూళ్ళో రీసెర్చ్ చెయ్యటానికి
వచ్చిందని అబద్ధం చెప్పి, సోమయాజులు గారి ఇంట్లో ఆమెకు ఆశ్రయం దొరికేలా చేస్తాడు.
తొలిచూపుతోనే వేదసంహితను ప్రేమించడం ప్రారంభిస్తాడు చలం.
ఒకరోజు అందరూ పొలాల్లో సంతోషంగా గడుపుతున్న సమయంలో,
హఠాత్తుగా సోమయాజులు గారి కూతురు భారతికి జలగ పడుతుంది.
ఆ సందర్భంలో అరుణ్ అనే యువకుడు వచ్చి ఆమెను రక్షిస్తాడు.
వేదసంహితతో అతనికి పరిచయం కలుగుతుంది.
అతను కూడా అంత్రోపాలజీ చదివినవాడు కావడంతో వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది.
ఇద్దరూ కలిసి పని మీద ఒకరోజు పట్నం వెళ్తారు.
సంహిత అరుణ్ కి తెలియకుండా తన నగలు కుదువపెట్టబోతుంటే, అతను వారించి ఆమె
నగలు ఆమెకు ఇప్పిస్తాడు.
వారిద్దరూ కలిసి తిరగడం చూసి ఊక్రోషంతో మదనపడిన చలం... తన ప్రేమను వెల్లడి
చేస్తాడు.
వేదసంహిత మొదట షాక్ అవుతుంది. ఆ తర్వాత తాను వివాహితురాలినని చెబుతుంది.
ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద తను వ్రాసిన థీసిస్ అతని చేతిలో పెట్టి అది
చదువమంటుంది. చలం కొయ్యబారిపోతాడు.
ఓ సాయంత్రం వేదసంహితను కలవడానికొచ్చిన అరుణ్ ఆమెకు వచ్చిన ఉత్తరం
చదువుతాడు అరుణ్.
ఇతరుల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదని అరుణ్ తో గొడవపడుతుంది.
అయితే ఆమె మీద తనకున్న వ్యామోహాన్ని వ్యక్తం చేస్తాడు అరుణ్. ఈ సందర్భంగా వారి
మధ్య గొడవ జరుగుతుంది. అరుణ్ ఆ తర్వాత వేదసంహితపై అనేక పుకార్లు పుట్టిస్తాడు.
అభిషేక్ ఆదిత్యపురం వస్తాడు. వేదసంహిత భర్తగా అతన్ని అందరికీ పరిచయం చేస్తాడు
చలం. అభిషేక్ మెక్సికో దీవుల్లో స్థిరపడ్డ భారతీయ సంతతి డాక్టర్. అపాచి తెగకు
నాయకుడు. అపాచి తెగ హక్కుల కోసం అతను చేస్తున్న పోరాటం, అక్కడి జైలర్ హెర్మన్
కార్డిస్ కి అభిషేక్ మధ్య సంవాదం, అనంతరం అభిషేక్ ఇండియాకు ముఖ్యంగా ఒక
అందమైన పల్లెటూరికి రావాలనుకోవడం... ఈ కథనం అంతా చదువరులకు ఉత్కంఠతను
కలిగిస్తుంది. అదే సందర్భంలో వేదసంహిత అభిషేక్ మీద రీసెర్చ్ చేయడం, ఆ సందర్భంగా
జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా అతనికి స్నేహపాత్రమవుతుంది. అతని సూచనల మేరకు
వేదసంహిత ఆదిత్యపురం గ్రామానికి వస్తుంది. ఈ విషయాలు ఒక్క చలంకి తప్ప ఇతరులకి
తెలియవు. రీసెర్చ్ పనిమీదే ఆమె ఆ గ్రామంలో వుంటోందని, అభిషేక్, వేదసంహిత
భార్యభర్తలనే అంతా భావిస్తారు. అభిషేక్ తన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకొంటాడు.
భారతి అరుణ్ ని ప్రేమిస్తున్న విషయం తెలియని సోమయాజులు ఆమెకు పెళ్ళి చేసే
ప్రయత్నంలో వుంటారు. దీంతో భారతి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అభిషేక్ తన
వైద్యంతో ఆమె ప్రాణం నిలబెట్టి, జరిగిన విషయం తెలుసుకొని అరుణ్ నిజస్వరూపం ఆమెకు
తెలిసేలా చేస్తారు. దీంతో సోమయాజులు గారి కుటుంబం పరువు నిలబడుతుంది. దీంతో ఆ
కుటుంబానికి అభిషేక్- వేదసంహిత మరింత దగ్గరవుతారు.
ఈ నేపథ్యంలో అభిషేక్, సంహిత ఆదిత్యపురం విడిచి వెళ్ళాల్సిన రోజు రానే వస్తుంది. సంహిత
దుఃఖితురాలవుతుంది. బ్రతుకుబాటలో ముందుకు సాగిపోయే తరుణంలో- ఆలంబనగా
ఒక అనుభవాన్ని అనుభూతిని మిగుల్చుకోవాలనుకుంది. ఆమె జీవితంలోకి అపురూపంగా
ప్రవేశించిన అభిషేక్ తో ఓ వెన్నెల రాత్రి.... గోదారి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా
మార్చుకుంటారు. భారమైన హృదయాలతో ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూ కోసం సంహిత ఒకవైపు,
వ్యక్తిగతమైన ప్రేమని విశ్వజనీయమైన ప్రేమగా మార్చుకోవడానికి మరో ట్రైన్ లో అభిషేక్
ప్రయాణమవుతారు. అప్పుడు చూస్తాడు చలం ఆమె మెడ మీద మచ్చని. అయితే అది
త్రాగుబోతైన ఆమె అసలు భర్త చేసిన గాయం అన్న నిజం, అతనికి ఎప్పటికీ తెలియకుండానే
ఉండిపోతుంది. ఇక్కడితో కథ ముగుస్తుంది.
* * *
కథారంభంలో వేదసంహితని సృష్టించినప్పుడు ఆమె అందానికి వివశుడై బ్రహ్మదేవుడు
ఆశువుగా శృంగార పద్యం చెబితే, సరస్వతీదేవి ఆగ్రహించి ఆ అమ్మాయి అందచందాలని ఏ
మాత్రం గుర్తించలేని వ్యసనపరుడైన భర్త దొరకాలని శపిస్తుంది.
దీన్నిబట్టి నవలలో మొత్తం కథానాయిక అష్టకష్టాలు పడుతుందని హింట్ ఇస్తాడు రచయిత.
ఆ దృష్టితో చదివే పాఠకులకు మొదట ఊహించినట్టుగా ఎక్కడా కష్టాలుండవు. నవల చివర
ఒకే వాక్యంతో ఆమె ఎన్ని కష్టాలు పడిందోననేది పాఠకుల ఊహకే వదిలేస్తాడు రచయిత.
అభిషేక్ రంగప్రవేశంతో కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది. తెలుగు సినిమాలో
హీరోకి వుండే క్వాలిటీస్ ఇతనికీ వుంటాయి. దీంతో వేదసంహిత పాత్ర ప్రాధాన్యత కాస్త
తగ్గినట్లుగా అనిపిస్తుంది.
అలాగే... భారతి -అరుణ్, వేదసంహిత -చలం , వేదసంహిత - అరుణ్ మధ్య జరిగే
సన్నివేశాలు...
హీరో కథలో ఎక్కువ భాగం మెక్సికో బ్యాక్ డ్రాప్ లో నడవడం ఆసక్తికరంగా వుంటాయి.
ఈ నవలలోని ప్రతి సన్నివేశాన్ని యండమూరి అద్భుతంగా వర్ణించాడు.
పల్లెసీమల్లోని అందాలను, అలవాట్ల గురించి చెబుతూ....
అక్కడ గాలులు గానం చేస్తాయట. గోదావరి గంధర్వ స్త్రీలా వుంటుందట....
అంటూ వర్ణించిన విధానం సహజాతి సహజంగా వుంటుంది.
ఇక అంత్రోపాలజి పరిణామక్రమాన్ని వివరించిన తీరు చూస్తే రచయిత దీనిపై చేసిన కృషి
అవగతమౌతుంది.
అదే సందర్భంలో పురుషుడు స్త్రీని తనకు అనుకూలంగా ఎలా మలచుకుంటున్నాడో చర్చించే
ప్రయత్నం చేస్తాడు రచయిత. ‘స్త్రీని తన కనుగుణంగా తిప్పుకున్నాడు ఆధునిక పురుషుడు.
భర్త ఎలాంటి వాడైనా, అతడికి అణిగి వుండకపోతే తనకి భద్రత లేదనుకునే మానసిక స్థితికి
తీసుకొచ్చాడు. ఆధారపడటాన్ని ఆమెలో ప్రవేశపెట్టాడు. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి
పితృస్వామ్య వ్యవస్థకు మార్చగలిగాడు. వరూధిని చుట్టూ నీతి సూత్రాలు అమర్చాడు. తాను
మాత్రం కృష్ణుడిలానే వుండిపోయాడు’ అంటూ నేటి ఆధునిక పురుషాధిక్యతను కొంత చర్చించే
ప్రయత్నం చేస్తాడు రచయిత.
నవల ప్రారంభంలో వేదసంహిత అందానికి బ్రహ్మ వివశుడైన సందర్భంగా జరిగితే చర్చలో
కూడా ‘ఒక స్త్రీ జీవితం సారమా-నిస్సారమా అని నిర్ణయించేది కేవలం భర్తేనా? భర్త తోడులేని
స్త్రీకి ఇంకే సుఖమూ లేదా? అంటూ నారదుడు ఒక సమస్యను లేవనెత్తుతాడు.
‘స్త్రీగానీ, పురుషుడుగానీ ఆనందంగా వుండడానికి కావలసింది... ప్రేమించిన మనిషి
లేకపోవడం కాదు. తనకి ప్రేమించే హృదయం లేకపోవడం...’
‘ప్రేమంటే ఆహలాదం. అది స్త్రీ, పురుషు సంపర్కమే కానవసరంలేదు...’ అంటూ ప్రేమపైనా
చర్చ నడుస్తుంది.
అయితే... ఈ చర్చ ఒక పరిపక్వత దిశగా లేకపోయినా... కథావస్తువుగా ఎంచుకున్న బ్యాక్
డ్రాప్, రచనా శిల్పం నవలను ఆసాంతం ఆసక్తికరంగా చదవడానికి దోహదం చేస్తుంది.
గోదారి ఒడ్డున ఓ వెన్నెల రాత్రి నాయికా నాయకుల శృంగారాన్ని... ఎక్కడా శృతి
మించకుండా, అశ్లీలతకు తావులేకుండా, రసజ్ఞత ఉట్టిపడేలా వర్ణించడం అద్భుతం.
మొత్తంగా ఈ నవలలో పల్లెటూరి అందాలు, ఒక దేశప్రజల స్వేచ్ఛాపోరాటం, గాయపడిన ఓ
హృదయం వ్యక్తిత్వ పోరాటం ఈ నవలను ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates