
హృదయ స్థాయి మనకు బాగా దగ్గరగా ఉన్నప్పుడు సహజంగానే, అతి తక్కువ సమయంలోనే వారితో ఆత్మీయత పెనవేసుకుంటుంది. లతలా అల్లుకుంటుంది. స్నేహపరిమళాలు వెల్లివిరుస్తాయి. అలాంటి అరుదైన పరిచయమే డాక్టర్ భార్గవి రొంపిచర్ల గారి రూపంలో నా మనసు తలుపు తట్టింది. వృత్తిరీత్యా డాక్టరైన భార్గవి గారు సంగీత, సాహిత్య ప్రియులు. వారు మధురంగా పాడుతారు. ఎంత మధురంగా అంటే వారు నండూరి గారి ఎంకి పాటలు పాడితే ఎంకి నాయుడు బావలు శ్రోతల ముందు ప్రత్యక్ష్యమౌతారు. వారు డాక్టర్ గురవారెడ్డి గారి ‘గురవాయణం’లో కనిపిస్తారు. డాక్టర్ నక్కా విజయరామరాజు గారి ‘భట్టిప్రోలు కథలు’లో వారి ప్రోత్సాహం కనిపిస్తుంది. సాహితీ సేద్యంలో విఏకె రంగారావు గారు మొలకెత్తించిన ‘ఆలాపన’ కల్పవృక్షపు అమూల్య పుష్పం. అటువంటి పుస్తకానికే తలమానికం విఏకె రంగారావు గారితో డాక్టర్ భార్గవి గారి ‘మాట మాట’ఇంటర్వ్యూ. పుంకాను పుంకాలుగా అనేక పుస్తకాలను చదివిన సాహిత్య కర్షకురాలు డాక్టర్ భార్గవి గారు. రవీంద్రనాథ్ టాగూర్ ‘గీతాంజలి’ని తెలుగులోకి అనువదించిన ప్రజ్ఞాశాలి. ఇక కెవికె రంగారావుగారి గురించి చెప్పాలంటే... వారి పూర్తి పేరు వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు . అనేక ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసిన కాలమిస్టు. దీంతోపాటు సంగీత సాహిత్యాలనే కాక నాట్య కళను కూడా ఆజన్మాంతం ఆరాధించే త్రివేణీ సంగమేశ్వరుడు. ఏడు పదులు దాటినా నిత్య యవ్వనుడై, నేటికీ శక్తి చైతన్యవంతమైన నాట్యం చేస్తారు. వారి అవిరళ కృషికి మహోద్గ్రంధ రూపమే 513 పేజీల ‘ఆలాపన’. ఈ పుస్తకాన్ని ప్రచురించిన భార్గవిగారు నిజంగా అభినందనీయులు. అంతటి సాహితీ ప్రియులైన భార్గవిగారితో పరిచయం ఇటీవల జరిగిన పుస్తక మహోత్సవంలో జరిగింది. అదొక మరుపురాని జ్ఞాపకం.. అద్వితీయ అనుభూతి. ఆ సందర్భంగా తనతో అనేక విషయాలను పంచుకునే అవకాశం లభించింది. నాలోని సాహిత్యాభిలాషను గుర్తించడం నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. నాటి పరిచయాన్ని గుర్తు పెట్టుకొని డాక్టర్ గురువారెడ్డి గారి ‘గురవాయణం’ పంపిన భార్గవి గారి వాత్సల్యానికి ప్రణామాలు చెప్పాల్సిందే. కీళ్ల డాక్టర్‌గా సుప్రసిద్ధులైన డాక్టర్ గురవారెడ్డి ‘గురవాయణం’ పుస్తకంతో తనలోని మరో కోణాన్నిఆవిష్కరించారు. జగమెరిగిన గురవారెడ్డిగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో... ఇక.. డాక్టర్ భార్గవి గారు తానే స్వయంగా ఫోన్ చేసి వారింటికి రమ్మని ఆహ్వానించడం మరింత ఆనందాన్నిచ్చింది. ఈ సరికొత్త సాహితీ పయనం కొత్తపుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నా... భార్గవి గారి గాన మాధుర్యాన్నివినే అవకాశం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా... ఆ అనుభూతిని మరోసారి మీ అందరితో పంచుకునే తరుణం త్వరలోనే రావాలని కోరుకుంటున్నా...
No comments:
Post a Comment