చట్టబద్దమైన అనుమతి ఇస్తుంది కోర్టు. ఈ ప్రక్రియ కొన్ని దేశాల్లో అమలులో వున్నప్పటికీ మనదేశంలో ఇంకా అంత స్పష్టత రాలేదనే చెప్పాలి.
ఈ నవలలోని కథాంశాన్ని పరిశీలిస్తే... హృదయాన్ని ద్రవింపచేసే తల్లీ కొడుకుల కథ ఇది. ప్రేమంటే
వ్యామోహం కాదు, వ్యక్తిగత ఆకర్షణ అంతకంటే కాదు... అది ఇద్దరి వ్యక్తుల మధ్య చిగురించే
అనుబంధం. అది ఎలాంటి త్యాగాలకైనా వెరవదు అని చాటిచెప్పే అక్షర, కిరణ్ ల ప్రేమగాథ ఇది.
చిన్నతనంలో అనుకోకుండా వికలాంగురాలిగా మారి, ఎంతోకాలం బతకదని డాక్టర్లు చెప్పినా, తల్లిదండ్రుల
ప్రోత్సాహంతో బలమైన వ్యక్తిత్వమున్న వ్యక్తిగా తనను తాను నిరూపించుకుని, స్ఫూర్తినిచ్చే లాయర్ అక్షర
కథ ఇది. చావుబతుకుల్లో ఉండికూడా... తనకు బతుకుపై ఆశ కలిగించిన ఇమెయిల్ స్నేహితురాలిని
తను చనిపోయేలోగా ఒక్కసారైనా చూడాలని వెతుక్కుంటూ వెళితే, అప్పటికే ఆ స్నేహితురాలు చనిపోతే
ఆమెకు ఓ ప్రేమికుడిచ్చే కన్నీటి నీరాజనం ఈ కథ. అంతేకాదు...మెర్సీకిల్లింగ్ పై ఇద్దరు డాక్టర్ల మధ్య
జరిగే చర్చ వాస్తవికతకు అద్దం పడుతుంది. పాఠకుడికి బోల్డంత సమాచారాన్ని అందిస్తుంది.
భర్తను కోల్పోయి, చివరకు తానుకూడా అనారోగ్యంపాలై ఇక ఎన్నాళ్ళో బ్రతకనని తెలుసుకున్న ప్రసాద్ తల్లి
సరోజ... తప్పని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకొని తన కొడుకు చనిపోడానికి మెర్సీ కిల్లింగ్ కోసం
ప్రభుత్వాన్ని అనుమతి కోరుతుంది. మెర్సీకిల్లింగ్‌కి అనుమతి ఎట్టి పరిస్థితులలోనూ
ఇవ్వకూడదనంటూ... వివిధ దేశాల అనుభవాలను వివరించడంతో పాటు వ్యక్తిగతంగా వికలాంగురాలైన
తాను ఇరవైఏళ్లలోపే చనిపోతానని రెండుసార్లు డాక్టర్లు చెప్పినా ఆత్మవిశ్వాసంతో ఎదిరించానని వాదిస్తుంది
లాయర్ అక్షర. ఈ సందర్భంగా ఈ వ్యాధి గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి
సమాజంలో వారి పరిస్థితుల గురించి ఎన్నో జీవిత ఉదాహరణలను రచయిత మనకు వివరిస్తాడు.
నవల ప్రారంభంలోనే కొనఊపిరితో వున్న పావురాన్ని నిర్థాక్షిణ్యంగా బండాకేసి కొట్టి చంపేసి, దానికి
బాధనుంచి విముక్తి కలిగించానని తన చిన్నతనంలోనే చెప్పే సిద్ధార్థ, ఆ తర్వాత డాక్టర్ గా కొనఊపిరితో
కొట్టుమిట్టాడే రోగులకు మెర్సీకిల్లింగ్ ద్వారా విముక్తి కలిగించడాన్ని సమర్థిస్తాడు. ఎంత కష్టంలో ఉన్నా,
బతకలేని పరిస్థితిలో ఉన్నా ప్రాణంతీసే హక్కు ఎవరికీలేదని నమ్మడంతోపాటు తోటి డాక్టర్ సిద్ధార్థను
పోలీసులకు పట్టిస్తాడు డాక్టర్ వలీ. వీరిద్దరి మధ్య జరిగే వాదనలో రచయిత రెండువైపులా వుంటాడు.
అదే సందర్భంలో మనుషుల ప్రవర్తన సందర్భాన్ని బట్టి విభిన్నరీతుల్లో ఉంటుందో... అప్పటికది
నిజమేకదా అనిపించేలా మలిచిన వైనం ఆసక్తికరంగా వుంటుంది. సరోజ తల్లి తన భర్తను తనే అతని బాధని
చూడలేకపోయానని, అందుకే బిపి మాత్రలు సరిగ్గా ఇవ్వక అతని మరణాన్ని త్వరపరిచానని చెప్పడం,
తాను ఎంతోకాలం బతకనని తెలుసుకున్న సరళ... తనకంటే ముందే తన కొడుకు చనిపోవాలని
కోరుకోవడం, అందుకోసం ఎదురుచూడడం ఆయా సందర్భాల్లో వారి మానసిక సంఘర్షణను కళ్లకు కట్టినట్లు
వర్ణించాడు రచయిత.
ముఖ్యంగా రెండు సన్నివేశాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. ప్రసాద్ కు ఇంటర్నెట్ ద్వారా
పరిచయమవుతుంది రాగిణి. ఒంటరిగా విపరీతకోర్కెలతో రగిలిపోతున్న ప్రసాద్ కు రాగిణి పరిచయం
ఉపశమనం కలిగిస్తుంది. బతుకుపై ఆశను రేపుతుంది. తాను చనిపోయేలోపు ఒక్కసారైన రాగిణిని
చూడాలని తల్లిని ఒప్పించి, వాళ్ల ఊరు తీసుకెళతాడు. తీరా వెళ్లిన తర్వాత రాగిణి కుటుంబసభ్యుల
తీరు కొంత బాధ కలిగించినా రాగిణిపై వున్న ప్రేమతో భరిస్తాడు. తర్వాత రాగిణిని చూసేందుకు ఇంట్లోకి
తీసుకెళ్లి, ఆరునెలల క్రితమే చనిపోయిన రాగిణి ఫొటోను చూపిస్తారు. ఈ సన్నివేశం కళ్లను చెమరింప
జేస్తుంది. చివరలో ప్రసాద్ తల్లి అక్షరను, కిరణ్‌ను తన కొడుకు మరణ వేదనను చూపించడానికి
తీసుకువెళ్లి ఒక గంట కూర్చోమనడాన్ని చాలా ఆర్ద్రంగా చిత్రించాడు రచయిత. ప్రసాద్ మరణ యాతనను
కనీసం అరగంట కూడా చూడలేని అక్షర అక్కడినుండి బలవంతంగా బయటపడటం... ఇదంతా
హృదయాన్ని పిండేసినట్లుగా వుంటుంది. అంతవరకు మెర్సీకిల్లింగ్‌కి బద్దవ్యతిరేకిగా వున్న అక్షర..
తానుగానీ తప్పుగా వాదించానా అనే సందిగ్ధంలో పడుతుంది. ప్రసాద్ మరణించినప్పటికీ మరో కేసు
విషయంలో సంచలనాత్మక తీర్పును కోర్టు ఇచ్చిందని చెప్పడంతో ఈ నవల ముగుస్తుంది.
మెర్సీకిల్లింగ్ పై వివిధ సందర్భాల్లో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను సేకరించి సందర్భోచితంగా
వాటిని చర్చించడం... రచయిత శ్రమకు అద్దం పడుతుంది. వినూత్నమైన కథాంశంతో రచనలు
చెయ్యడంలో చెయ్యి తిరిగిన సలీం.. నవల ఆసాంతం ఆయా పాత్రల ఔచిత్యం ఎక్కడా దెబ్బతినకుండా
నడిపిన తీరు, రచయిత శైలీ ఆకట్టుకుంటుంది. ఈ నవల నాకు బాగా నచ్చింది. ఏకబిగిన
చదివేశాను. మీరూ ప్రయత్నించండి మరి...
No comments:
Post a Comment