మధ్యాహ్న సమయం... విజయవాడలోని స్వరాజ్యమైదాన్ వైపు
దారితీశాను. స్వరాజ్యమైదాన్ అనేకంటే సాహితీవనం అంటే
బాగుంటుందేమో...
ఎందుకంటే అక్కడ 27వ పుస్తక మహోత్సవం
జరుగుతోంది మరి. అంత ఎండలోనూ... సాహిత్య పరిమళాలు మనసును
ఆహ్లాదభరితం చేస్తోంటే... ఒక్కో దుకాణం.. విరబూసిన పారిజాతాలను
తలపిస్తుంటే...ఆ ఆవరణ అంతా ఒక్క చుట్టు తిరిగాను. అప్పటికి గాని
మనసు కుదుట పడలేదు.
అనంతరం చలసాని ప్రసాద్ సాహిత్య వేదిక వద్దకు వెళ్లాను. ప్రతిరోజూ
మొక్కకు మొగ్గలు తొడిగినట్టు... ప్రతి సాయంత్రం.. కొత్తకొత్త పుస్తకాలను
ఆవిష్కరిస్తోన్న వేదిక
అది. అలాంటి వేదికపై ప్రముఖ రచయితలు గొల్లపూడి
మారుతీరావు గారు, శ్రీరమణ గారు ఇంకా డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారు, డాక్టర్
నక్కా విజయరామరాజు గారితో పాటు శ్రీశ్రీ పబ్లికేషన్స్ విశ్వేశ్వరరావు గారు,
వనజా తాతినేని గారు వంటి ప్రముఖులను కలవడం నా అదృష్టం అనే చెప్పాలి. ఆ
సాహితీకారుల సాహిత్య పరిమళాల మధ్య నేను ఉక్కిరిబిక్కిరి అయ్యానంటే
అతిశయోక్తి కాదు మరి.
ముఖ్యంగా గొల్లపూడి గారి నుండి, శ్రీరమణ గారి నుండి రెండేసి పుస్తకాలు
అందుకోవడం అనిర్వచనీయమైన అనుభూతికి గురిచేసింది. అది మాటల్లో
చెప్పలేని అవ్యక్తానుభూతి. వారితో నాలుగు మాటలు
పంచుకోవడం మరింత
ఉద్విగ్నతను కలిగించే అంశమే.
శ్రీరమణ గారి గురించి చెప్పాలంటే.. తన సొంత ఊరంటే ఆయనకు చచ్చేంత
మమకారం. ఆయన ఆ ఊరొదిలి వచ్చినా... ఆ ఊరు ఆయన్నొదల్లేదని,
కలం పట్టుకోగానే వారి వీధి అరుగులు, గుడి, బడి వాటిలో కబుర్లాడుకునే పిల్లా
పెద్దా కళ్లముందుకొస్తారని, అందుకే తన కథలు ఊరివాసన కొడతాయని తన కథల
గురించి చాలా సాధారణంగా చెప్పుకునే గొప్ప రచయిత ఆయన. మిథునం ఒక
జీవితం, బంగారు మురుగు ఒక సంప్రదాయం, ధనలక్ష్మి ఒక విజయగాథ
అంటూ తన కథలపై ఉన్న మమకారాన్ని మన మనసుకు హత్తుకునేలా
చెబుతారాయన. అందుకే ఇంత గొప్పగా ఎలా రాస్తారని రమణ గారిని అడిగాను.
రెండు ముక్కల్లో ఆయన చెప్పిన సమాధానం.. ‘కాస్త పరిశీలన’, ఆ
పరిశీలించిన దాన్ని ‘కాస్త అల్లగలగడం’ మినహా నేనూ మీలాంటి వాడ్నే అంటూ
తేల్చేసారు.
కానీ... పరిశీలించడం అందరూ చేస్తారు. మనసుకు హత్తుకునేలా అల్లడం
మాత్రం శ్రీరమణ గారే చేస్తారు. అందుకే ఆయన కథల్లో అంతటి స్థానికత, సరళత
వుంటాయి.
ఇక గొల్లపూడి గారి గురించి చెప్పడమంటే చంద్రుడికో నూలు పోగు అన్నట్టే.
నిన్నటి పుస్తక మహోత్సవంలో నన్నల్లుకున్న సాహితీ పరిమళాలను అనుభవించి
అనుభూతిస్తున్నానంటే.... నమ్మాలి మరి.
No comments:
Post a Comment