
గానం, సంగీతం, సాహిత్యం, నాట్యం, యాంకరింగ్, డబ్బింగ్ వంటి
అనేక కళలో అభినివేశం...
సాంప్రదాయం... ఆధునికత కలబోసిన అచ్చతెలుగు ఆణిముత్యం..
ఆత్మగౌరవం... నిండైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే హుందాతనం...
మాటలు నవనీతం.. పాటలు మృదుమధురం...
రమ్యమైన రూపం... ఒదిగి ఉండే వినయం..
ఆమె మరెవరో కాదు...గాన సరస్వతి సునీత.
మధుర గాయని సునీత ఉపద్రష్ట.
నేడు (మే 10) ఆమె పుట్టినరోజు.
17ఏళ్ల క్రితం ‘ఈవేళలో నీవు ఏం చేస్తువుంటావో...’ అంటూ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ‘గులాబీ’బాల...‘ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ...ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే .. ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే...ఆనందాలు పెంచింది’.. అంటూ
అందాల గొంతులోని సుగంధాలతో సందడి చేస్తూనే వుంది. ఈ పాటంటే నాకెంతిష్టమో చెప్పలేను. 15ఏళ్ల వయసులో మొదటిసారిగా సినిమాలలో గాయనిగా ప్రవేశించారు. సుమారు 750 సినిమాలకు పైగా డబ్బిగ్, 3000 పైగా పాటలు...
స్వదేశంలోనే కాకుండా కువైట్, దుబాయ్, మలేషియా, సింగపూర్, లండన్, అమెరికా, ఫిలిప్పీన్స్ , కెన్యా మొదలైన దేశాలలో ఐదారొందలకుపైగా స్టేజీ షోలు చేసిన ప్రతిభాశాలి సునీత.
ఇక ఒక్కసారి తన మనసులోకి తొంగిచూస్తే...
చాలా సున్నితమైన మనస్తత్వం ఆమె నైజం.
తను పాడుతుంటే అక్షరాలు కందిపోతాయేమోననిపిస్తుంది.
ఆ అక్షరాలకు జోలపాడుతున్నట్టుగా అనిపిస్తుంది.
పాడుతూ అనుభూతి చెందుతుంది...
ఆ అనుభూతి తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది కూడా.
పాటకి భావం గుండె చప్పుడు లాంటిది... అది లేకపోతే డ్రైగా వుంటుందని తన ఫీలింగ్.
తనకు సాహిత్యంపై ఉన్న అవగాహనతోనే పాటలోని భావాన్ని పట్టుకోగలుగుతుంది.
ఆ భావ స్పందనను తన గొంతులో పలికించగలుగుతుంది.
సునీత గారికి సాహిత్యం అంటే చాలా ఇష్టం..
అందులోని సున్నితత్వాన్ని తను బాగా ఆస్వాదిస్తారు.
సాహిత్యం... సంగీతం భార్యాభర్తల అనుబంధంలా వుండాలని భావించే
తను పెరిగిన వాతావరణం కూడా అందుకు కారణం కావొచ్చు.
తన ఇల్లు సంగీత సాహిత్యాలకు నిలయం.
వారింట్లో సాహిత్యానికి సంబంధించిన చర్చోపచర్చలు ఎప్పుడూ జరుగుతుండేవట.
ఇప్పటికీ ఖాళీ సమయాల్లో తనకు నచ్చిన పుస్తకాలు చదవడం...
వంట చేయడం తనకెంతో ఇష్టం.
తను చాలా బాగా వంట చేస్తారు. ముఖ్యంగా మామిడికాయ పప్పు.
ఇక అన్నింటికీ మించి తనెప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ... హాయిగా నవ్వుతుంటుంది.
దీనికి కారణమేంటని అడిగే చెప్పే సమాధానం ఒక్కటే...
లైఫ్ లో ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ లేవు అని ఒక్క మాటతో తేల్చేస్తారు.
ఇవాళ మనం సంతోషంగా ఉన్నామంటే... అది మన ద్వారానే తప్ప
ఇంకోకరి ద్వారా కాదంటూ హాయిగా నవ్వేస్తుంది.
ఇక పార్టీలకు వెళ్లడం గానీ, హోటల్స్ లోనో, బయటి ఫుడ్డో తినడం గానీ అసలు అలవాటు లేదు.
రాధాగోపాలం సినిమా సమయంలో బాపుగారిచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనిదంటూ మురిసిపోతుంది. అప్పుడు భలే ముద్దొస్తుందిలే..హహహ...నిజం.
అలాగే కీరవాణిగారి సంగీత సారథ్యంలో ఎన్నోపాటలు పాడారు.
సునీత గొంతు నుండి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాటలనెన్నో ఆయన పాడించారు.
ఇంకా అందరికీ ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నా...
కీరవాణి గారు సునీతని ముద్దుగా ‘పిల్లి’ అని పిలుస్తారు. తను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది ఈ పిలుపుని.
ఆమెకి ఎన్నో కలలున్నాయి...
అన్ని దేశీయ భాషలలోనూ పాడాలని... జాతీయ అవార్డు సొంతం చేసుకోవాలని...
సంగీతం స్కూలు పెట్టాలని... పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించాలని..ఇలా... అనేక లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళుతున్న సునీత గారు...
ముందు ముందు తన లక్ష్యాలను అందుకోవాలని మనసారా కోరుకుంటూ...
తనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా...
- అంజనీ యలమంచిలి
No comments:
Post a Comment